Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బుక్ చేసుకుంటే...ఇంటికే మామిడిపళ్లు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
గతంలో ఎన్నడూలేని విధంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిని కాంక్షిస్తున్న టీఎస్ఆర్టీసీ ఇప్పుడు మరో సరికొత్త సేవల్ని ప్రారంభించింది. ప్రస్తుతం మామిడిపళ్ల సీజన్ నడుస్తుండటంతో దాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవాలని నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా మ్యాంగో ఎక్స్ప్రెస్ సేవల్ని ప్రవేశపెడుతూ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్లు బాజిరెడ్డి గోవర్థన్, వీసీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నారు. సహజ సిద్ధంగా పండించిన జగిత్యాల మామిడిపండ్లను కిలో రూ.115 చొప్పున 5, 10, 15 కిలోలతో పాటు టన్ను నుంచి పది టన్నుల వరకు బల్క్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. బుక్ చేసిన వారం రోజుల్లో డోర్ డెలివరీ సౌకర్యంతో ఇంటికి మామిడిపళ్లు వస్తాయని వారు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు కూడా వీటిని ఎగుమతి చేసుకొనే సౌకర్యం అందుబాటులో ఉంటుంది. టీఎస్ఆర్టీసీ కార్గో, పార్సిల్ సర్వీసుల ఈ సేవలు లభిస్తాయి. అపార్ట్మెంట్లలో ఉండేవారు బల్క్ బుకింగ్స్ చేసుకుంటే నేరుగా వారి ఇండ్ల వద్దకే కార్గో సర్వీసులను నడుపుతామని వివరించారు. ఇతర వివరాలకు www.tsrtcparcel.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. 040-23450033, 040-69440000 నెంబర్లకు ఫోన్ చేయోచ్చు. ఆర్టీసీ ఇప్పటి వరకు మేడారం మొక్కు బంగారాన్ని అమ్మవారికి సమర్పించి, ప్రసాదాన్ని అందించే సేవల్ని చేపట్టింది. భద్రాద్రి సీతారాముల కళ్యాణోత్సవ కోటి గోటి తలంబ్రాలను భక్తులకు చేరవేసేలా సేవల్ని అందించారు. తాజాగా బంగినిపల్లి మామిడిపండ్లను ఇంటి వద్దకే రవాణా చేసే సేవల్ని అందిస్తున్నట్టు యాజమాన్యం తెలిపింది.