Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్-విజయవాడ హైవే సమీపంలో యువతి, యువకుడి మృతదేహాలు
- మృతులు వారాసిగూడ వాసులుగా గుర్తింపు
- అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
నవతెలంగాణ- అబ్దుల్లాపూర్‌మెట్/సిటీబ్యూరో
హైదరాబాద్ నగర శివారులో దారుణం జరిగింది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కొత్తగూడెం బ్రిడ్జి సమీపంలోని ముండ్ల చెట్ల మధ్య గుర్తుపట్టలేని స్థితిలో నగంగా ఉన్న యువతి, యువకుడి మృతదేహాలను మంగళవారం స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అన్ని కోణాల్లో పరిశీలించారు. క్లూస్ టీమ్స్‌ను రంగంలోకి దించారు. మృతదేహాల సమీపంలో బ్యాగ్, హోండా యాక్టీవాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా మృతులు సికింద్రాబాద్ చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వారాసిగ ూడకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఎడ్ల యశ్వంత్(22), జ్యోతి(28)గా గుర్తించారు. అక్కడ లభించిన వస్తువుల ఆధారంగా వారిని మూడ్రోజుల కిందట దుండగులు హత్యచేసినట్టు నిర్ధారణకు వచ్చారు.
వివాహేతర సంబంధమే కారణమా?
యశ్వంత్, జ్యోతి మధ్య వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా అనుమానిస్తున్నట్టు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ఘటనా స్థలాన్ని బట్టి చూస్తే హత్యగా భావిస్తున్నాం. జ్యోతికి వివాహమైంది. భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. యశ్వంత్ మర్మాంగంపై నిందితులు దాడి చేసి ఛిద్రం చేశారు. జ్యోతి ముఖంపైనా రాయితో మోదారు' అని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలావుండగా ఆదివారం సాయంత్రం యశ్వంత్ ఇంటి నుంచి వెళ్లినట్టు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆదివారం నుంచి కనిపించకపోవడంతో చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జ్యోతి ఎవరో తమకు తెలియదని, ఎవరూ శత్రువులు లేరని పోలీసులకు తెలిపారు.