Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రామకృష్ణగౌడ్ భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
- కులాంతర వివాహాల ప్రోత్సాహానికి
- ప్రత్యేక చట్టం చేయాలి : కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు
నవతెలంగాణ-ముషీరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణగౌడ్‌ను అత్యంత కిరాతంగా హత్యచేసిన వారిని కఠినంగా శిక్షించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌బాబు డిమాండ్ చేశారు. రామకృష్ణగౌడ్ భార్య భార్గవికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కైలాబ్ బాబు మాట్లాడుతూ.. రామకృష్ణగౌడ్ భార్య ఫిర్యాదుపై భువనగిరి పోలీసులు వెంటనే స్పందించి ఉంటే ఇంతటి దారుణం జరిగేది కాదని చెప్పారు. హత్య విషయంలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. భార్గవి తండ్రి వెంకటేష్‌ను వీఆర్వో సర్వీస్ నుంచి తొలగించి అవసరమైతే అదే ఉద్యోగాన్ని భార్గవికి ఇవ్వాలన్నారు. తక్షణమే భార్గవికి ప్రభుత్వం రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా, లింగరాజుపల్లి గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరారు. పౌర సమాజంలో కులాంతర వివాహాల పట్ల మరింత చైతన్యం రావాలని ఆకాంక్షించారు. ఖమ్మంలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించిన బీజేపీ నాయకులు.. కులదురహంకార హత్య జరిగిన భువనగిరి వైపు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. భార్గవికి న్యాయం జరిగే వరకు ఆమెకు కేవీపీఎస్ అండగా ఉంటుందని తెలిపారు. కెేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రామకృష్ణ గౌడ్ ఆరు నెలల పసిపాప చదువు పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఆయన హత్య విషయంలో పోలీసుల వైఖరి సక్రమంగా లేదన్నారు. నిందితుల వాగ్మూలం తీసుకుని కేసును నిర్ధారించటం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, వెంటనే సిట్టింగ్ జడ్జితో కేసుని పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో కులనిర్మూలన సంఘం వ్యవస్థాపక సభ్యులు లక్ష్మీనాగేశ్వరి, పీపుల్స్ మానిటరింగ్ కమిటీ తెలంగాణ కోఆర్డినేటర్ శివలింగం, సమతా మిషన్ రాష్ట్ర నాయకులు శేఖర్, సీఐటీయూ రాష్ట్ర కోశాధికారి ఒంగూరి రాములు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రమేష్, ఆనగంటి వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు అశోక్ రెడ్డి, కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు బోడ సామేల్, కనకయ్య, యాదగిరి, దేవదానం, ఎస్ స్వామి, ప్రకాష్ కారత్ పాల్గొన్నారు.