Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
నవతెలంగాణ-కల్చరల్
వందేండ్లకు పూర్వమే సమాజంలోని అసమానతలు, మహిళల పట్ల వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించిన బసవేశ్వరుడు సాంఘిక విప్లవకారుడు ఆని రాష్ట్ర శాసన సభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని రవీంద్రభారతి ప్రధాన వేదికపై భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంఘ సంస్కర్త బసవేశ్వరుడి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక రాష్ట్రంలో జన్మించిన బసవన్న నాటి మూఢచారాల పట్ల యుద్ధమే ప్రకటించారని చెప్పారు. శ్రమ శక్తే దైవమని, జ్ఞానమే గురువు అని బోధించిన బసవేశ్వరుడు.. మహిళా జన పక్షపాతిగా.. వారికి సమాజంలో తగు ప్రాధాన్యత కోసం ఉద్యమించారని వివరించారు. సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బసవన్న ప్రాముఖ్యతను గుర్తించి అధికారికారికంగా ఆయన జయంతి నిర్వహిస్తోందని చెప్పారు. హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ మాట్లాడుతూ.. బసవేశ్వర జయంతిని అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ.. లింగాయత్ సామాజిక తరగతికి చెందిన వారిని బీసీ జాబితా నుంచి ఓబీసీల్లో చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పెట్టిందని, రాబోవు రోజుల్లో ఓబీసీ జాబితాలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. అనంతరం బసవేశ్వర కృప ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ మాజీ చైర్మెన్ బద్మి శివ కుమార్, సంస్థ అధ్యక్షుడు సంగమేశ్వర్ పాల్గొన్నారు.