Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కాటారం/ఆళ్ళపల్లి
వడదెబ్బకు గురై ఉపాధి కూలీ, తునికాకు సేకరణకు వెళ్లిన మరో మహిళ మృతిచెందిన ఘటన జయశంకర్-భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మంగళవారం జరిగింది. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
జయశంకర్-భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట గ్రామంలోని దూలం చెరువులో ఏప్రిల్ 25న ఉపాధి పనులు నిర్వహిస్తుండగా అట్టికేటి రామక్క (59) వడదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి కూలీలు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందారు. కాగా, ఉపాధి హామీ పనుల వద్ద నిబంధనల ప్రకారం వేసవిలో సరైన ఏర్పాట్లు చేయడం లేదని, అధికారుల నిర్లక్ష్యం వల్లే రామక్క మృతి చెందారని గ్రామస్తులు ఆరోపించారు. మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన మెస్సు పాపమ్మ (57) ఎలగల ఒంపు ఒర్రె పరిసర అటవీప్రాంతంలో బీడీ ఆకులైన తునికాకు సేకరణకు వెళ్లింది. మండుటెండలో మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయాసపడుతూ ఇంటికి చేరుకున్న పాపమ్మ గంటలోపే మృతి చెందింది. దాంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతురాలి కొడుకులు, కోడళ్ళు గతంలోనే చనిపోగా, ప్రస్తుతం ఇద్దరు మనవళ్లతో ఉంటుంది. పాపమ్మకున్న అర ఎకరంకు పట్టా పాస్బుక్ ఉండటంతో మనవళ్లకు రైతు బీమా పథకం కింద ప్రభుత్వ సాయం చేయాలని కోరుతున్నారు. ఫారెస్ట్ అధికారులు, బీడీ ఆకుల యాజమాన్యం మృతురాలికి ఆర్థిక సహాయం అందించి న్యాయం చేయాలని స్థానిక సర్పంచ్ మెస్సు కోటేశ్వరరావు కోరుతున్నారు.