Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంపదకు సృష్టికర్తలు కార్మికులే
- మేడే వారోత్సవాల్లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ-మెదక్ డెస్క్
మేడే విశిష్టతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య అన్నారు. సంపద సృష్టికర్తలు కార్మికులేనని అలాంటి కార్మికులకు కొనుగోలు శక్తి లేకుండా చేస్తూ దేశ ఆర్థిక సార్వభౌమత్వాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ధ్వంసం చేస్త్తోందని విమర్శించారు. మేడే వారోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. 1886లో అమెరికాలోని చికాగో నగరంలో 8 గంటల పనిదినం అమలు కోసం, వెట్టిచాకిరీ విముక్తి, కనీస హక్కుల కోసం కార్మికులు సాగించిన వీరోచిత పోరాటంలో ఆరుగురు కార్మిక నాయకులు అమరులయ్యారని, వేలమందికి తీవ్ర గాయాలయ్యా యని గుర్తుచేశారు. ఆ త్యాగాల సాక్షిగా ప్రపంచ కార్మికవర్గం నిర్వహించుకునే ఏకైక కార్మిక దినోత్సవం మేడే అని తెలిపారు. మోడీ సర్కార్ కార్మిక చట్టాలకు తూట్లు పొడుస్తూ 8 గంటల పని విధానం రద్దు చేసి, వేతనాల పెంపుదలలో యూనియన్ల భాగస్వామ్యం లేకుండా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూనియన్లు పెట్టుకునే హక్కు, పని భద్రత వంటి మౌలిక హక్కులపై దాడి చేస్తున్నారని విమర్శించారు. మేడే అమరవీరుల స్ఫూర్తితో కార్మికులను ఐక్యం చేసి, ప్రత్యామ్నాయ విధానాలకై సమరశీల ఉద్యమాలకు కార్మికవర్గం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మే 1 నుంచి 7వ తేదీ వరకు వారోత్సవంగా జరపాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ నిర్ణయించిందని తెలిపారు. మేడే ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో జరిగే ఈ మేడే కార్యక్రమాల్లో కార్మికులు, కార్మిక కుటుంబాలతో సహా వేలాదిగా ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం ఆయన వాలీబాల్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
కార్మికుల్లో నైపుణ్యాలను వెలికితీయడానికి ఈ క్రీడలు ఎంతో దోహదపడతాయని అన్నారు. కార్యక్రమంలో మేడే ఉత్సవ కమిటీ సభ్యులు మల్లేశం, నాయకులు సాయిలు, బాగారెడ్డి, మాణిక్యం, ప్రవీణ్, యాదగిరి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.