Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చేతి వృత్తిదారుల ఉపాధికోసం ఉద్యమం : చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేతి వృత్తిదారుల కోసం రాష్ట్ర కార్పొరేషన్, ఫెడరేషన్లు ఉన్నప్పటికీ వారి అభివృద్ధికి అవి ఎలాంటి కృషి చేయటం లేదనీ, అవి పేరుకు మాత్రమే ఉన్నాయని సీపీఐ(ఎం) కేంద్ర కమిటి సభ్యులు చెరుపల్లి సీతారాములు చెప్పారు. మంగళవారం హైదరాబాద్లోని వృత్తిదారుల భవన్లో లెల్లెల బాలకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీతరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, ఆ తర్వాత వాటిని అమలు చేయటం లేదని చెప్పారు. లబ్దిదారులను కార్యాలయాల చుట్టూ, టీఆర్ఎస్ నాయకుల చుట్టూ తిప్పుకుంటున్నారని విమర్శించారు. వృత్తిదారుల ఉపాధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్లో బీసీలకు కేవలం రూ. 5,678 కోట్లు మాత్రమే కేటాయించారని తెలిపారు. వృత్తిదారులకు ఉపాది లభించాలంటే ముడిసరుకుతో పాటు రుణ, మార్కెట్ సౌకర్యం కల్పించాలన్నారు. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఒకరినొకరు రాజకీయ విమర్శలు చేసుకోవటం తప్పితే వృత్తిదారుల బాగోగులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల కుల గణనపై దృష్టి పెట్టటం లేదని చెప్పారు. చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ కన్వీనర్ యం.వి.రమణ మాట్లాడుతూ వృత్తి దారులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారంతోపాటు ఉపాధి కోసం ఉద్యమించాలని సూచించారు. సాంస్కృతిక, సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వృత్తిదారులకు పిలుపునిచ్చారు. రజక వత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పి ఆశయ్య మాట్లాడుతూ వృత్తిదారులకోసం నెలకొల్పిన ఫెడరేషన్, కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమించాలని డిమాండ్ చేశారు. ఆత్మగౌరవ భవనాలను నిర్మించి, ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. సమావేశంలో గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బడుగు శంకరయ్య, విశ్వకర్మ వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రాళ్ళబండి కుమారస్వామి, క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్య దర్శి మల్లేష్ ,వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి విగేష్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాటూరి బాలరాజ్ గౌడ్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి నరేష్, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రావుల జంగయ్య, మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరింకల నరసింహా, వృత్తి సంఘాల నాయకులు పాల్గొన్నారు.