Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 521 ఎకరాల్లో వ్యవసాయ భూమే ఎక్కువ
- త్వరలోనే కార్యాచరణ
- అభ్యంతరాల స్వీకరణకు శ్రీకారం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టు పక్కల జిల్లాలు, ప్రధాన పట్టణాల అనుసంధానానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రాంతీయ రింగు రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈ మేరకు అధికార యంత్రాంగం చురుగ్గా కసరత్తు ప్రారంభించింది. త్వరలోనే కార్యాచరణ అమలుచేయనుంది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ ఉత్తరభాగానికి సంబంధించిన జాతీయ రహదారుల అథారిటీ(ఎన్హెచ్ఏఐ) ఉన్నతాధికారులు రెండు గెజిట్లు విడుదల చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో అభ్యంతరాల స్వీకరణకు స్థానిక రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈమేరకు ఇప్పటికే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం స్థానిక ఆర్డీవోలను కాంపిటెంట్ అథారిటీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాయి. భారత్మాల పరియోజన పథకం కింద చేపడుతున్న ఈ ప్రాజెక్టును ఇటీవల 98.989 కిలోమీటర్ల నుంచి 118.188 కిలోమీటర్ల వరకు గెజిట్ విడుదల చేయగా, అందుకు 521.72ఎకరాల భూమి అవసరమవుతుందని ప్రాథమికంగా గుర్తించారు. ఆ మేరకు భూసేకరణ చేసేందుకు అధికారిక ప్రక్రియ ప్రస్తుతం నడుస్తున్నది.
ఏడు గ్రామాల్లో..
యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఏడు గ్రామాల్లో సేకరించాల్సిన భూమి ఉండటం గమనార్హం. దత్తాయిపల్లి, ఇబ్రహీంపూర్, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, వేల్పులపల్లి, దత్తార్పల్లి, మల్లాపూర్ గ్రామాల గుండా తొలి గెజిట్లో పేర్కొన్న రోడ్డు మార్గం(ఎలైన్మెంట్) వెళ్లనుంది. కాగా ఈ గ్రామాల్లో అత్యధికంగా భూమి రైతులదేనని సమాచారం. దాదాపు వ్యవసాయ భూమి కావడం గమనార్హం. 390.2 ఎకరాల వ్యవసాయ భూమి కాగా, మరో 131.52 ఎకరాలు ప్రభుత్వానిదని చెబుతున్నారు. ప్రస్తుతం అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతున్నదనీ, మరోక వారం రోజుల్లో అది ముగుస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యంతరాల స్వీకరణ అనంతరం చేపట్టాల్సిన చర్యలపై ఎన్హెచ్ఏఐ అధికారులు దృష్టిసారించారు.
పరిహారం చదరపు మీటర్ల ప్రాతిపదికనే !?
ఆర్ఆర్ఆర్ మొదటి గెజిట్ పరిధిలో సేకరించే భూమికి పరిహారం చదరపు మీటర్లల్లోనే ఇవ్వాలని ఎన్హెచ్ఏఐ భావిస్తున్నది. గెజిట్లో పేర్కొన్న గ్రామాల్లో వ్యవసాయ భూమే అధికంగా ఉంది. దీంతో రైతులకు ఎకరాల ప్రాతిపదికనే పరిహారం అందనుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాగా, అధికారులు మాత్రం చదరపు మీటర్ల ప్రాతిపదికనే పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిసింది. దీనిమూలంగా రైతులకు నష్టంజరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. రోడ్డు వెళ్లే మార్గంలో ఎంత మేర భూమి పోతుందో, ఆమేరకే పరిహారం చదరపు మీటర్లల్లో లెక్కేసి ఇస్తారని సమాచారం. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో జరిగిన భూక్రయవిక్రయాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ రేట్లు, భూసేకరణ చట్టం-2013 ప్రకారం నష్టపరిహారం ధర నిర్ణయించనున్నట్టు అధికారిక సమాచారం. ఈ విషయపై స్థానిక రెవెన్యూ అధికారులతో కాంపింటెంట్ అధికారులు కలిసి పనిచేస్తున్నారు. సాధారణంగా ఎకరానికి 4,046.85 చదరపు మీటర్లుగా లెక్కించి పరిహారం ఇవ్వనున్నారు. రైతుల భూములు ఏమేరకు సేకరిస్తామనే విషయాన్ని అధికారిక ప్రకటన ద్వారా తెలియజేస్తామని ఎన్హెచ్ఏఐ చెబుతున్నది.
స్థానిక అధికారులకు 'నివేదిక'
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్పై ఒక ప్రయివేటు ఏజెన్సీ చేసిన సర్వే నివేదికను ఇటీవల స్థానిక రెవెన్యూ అధికారులకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏజెన్సీ ఇచ్చిన సర్వేనెంబర్లను జిల్లా రెవెన్యూ అధికారులు మరోసారి అధ్యయనం చేస్తున్నారు. భూమికి సంబంధించిన పట్టాదారు పేరు, సర్వే నెంబరు, గ్రామం, మండలం, జిల్లా, విస్తీర్ణం తదితర వివరాలు ప్రత్యేక పద్ధతిలో సేకరించి పొందుపరుస్తున్నట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు చెబుతున్నారు. ఇక అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ముగిస్తే, భూసేకరణ ప్రారంభమవుతుందని అధికారిక సమాచారం.