Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే కక్షసాధింపు
- రూ.మూడు వేల కోట్లు నష్టం వచ్చినా కొనుగోలు చేస్తున్నాం
- ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో వాటిని ఆపేందుకు కేంద్రం కుట్ర : గంగుల
- శ్వేతపత్రం విడుదల
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ధాన్యం కొనుగోళ్లపై బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వరి పండించే రాష్ట్రాల్లో బీజేపీ సర్కార్లు లేనందువల్లే కక్షసాధిస్తున్నదనీ, మోడీ సర్కారు మొండివైఖరితో రూ.మూడు వేల కోట్ల నష్టమొచ్చినా భరించి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నదని తెలిపారు. అయినప్పటికీ ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో కొనుగోళ్లను ఆపేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. సౌకర్యాలు లేవు, గన్నీలు లేవనేవి అసంబద్ధ ఆరోపణలని కొట్టిపారేశారు. రాష్ట్రవ్యాప్తంగా కిలో తరుగు లేకుండా 3,525 కొనుగోలు కేంద్రాల్లో 55,553 మంది రైతుల నుంచి 4.21 లక్షల మెట్రిక్ టన్నుల సేకరించినట్టు తెలిపారు.
కేంద్రం ఒక్క గన్నీ బ్యాగు ఇవ్వకున్నా 7.77 కోట్ల బ్యాగులను తమ ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఒకరిద్దరు మిల్లర్లు చేసే అక్రమాలను సాకుగా చూపించి కొనుగోళ్లను అడ్డకోవడం సమంజసమేనా? అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వ నిధులపై కేంద్రం పెత్తనమేంటని ఆగ్రహం వ్యక్త ం చేశారు. కొనుగోళ్లు మొదలు కాగానే ఫిజికల్ వెరిఫికేషన్ ఎందుకని సందేహం వ్యక్తం చేశారు. జూలైలో వెరిఫికేషన్ చేస్తే సంపూర్ణంగా సహకరిస్తామని తెలిపారు.
ధాన్యం పండించే రాష్ట్రాలైన తెలంగాణ, పంజాబ్, ఒడిషా, చత్తీస్ ఘడ్, ఆంధ్రప్రదేశ్ వంటి చోట్ల బీజేపీ అధికారంలో లేకపోవడం వల్లనే కొనుగోళ్లలో ఇబ్బందులు కలుగజేస్తున్నదని ఆరోపించారు. కేంద్రం సహకరించకున్నా రైస్ మిల్లర్లు, సరఫరాదారుల స్థాయిలో యుద్దప్రతిపాధికన సేకరించామని పేర్కొన్నారు. కొనుగోళ్లలో వేగం పెరిగిన దశలో భారత ఆహార సంస్థ అధికారులను ఉసిగొల్పి రైస్ మిల్లులపై వెరిఫికేషన్ పేరుతో దాడులు చేయిస్తూ ధాన్యాన్ని దించనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల పక్షాన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలబడాలని కోరారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం విలువ రూ.821 కోట్లు ఉంటుందని చెప్పారు. వీటికి సంబంధించిన డబ్బులను రైతు ఖాతాలో జమ చేసే ప్రక్రియకు కేంద్రం అడ్డుపడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత ఆహార సంస్థతో 2019లో ఎంఓయూ కుదిరినప్పుడు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎలా సేకరిస్తుందో అలా సేకరిస్తామని స్పష్టంగా చెప్పామనీ, ప్రస్తుత ఫిజికల్ వెరిఫికేషన్లు ఆ ఎంఓయూకు వ్యవతిరేకంగా ఉన్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికే కేంద్రం ఈ తనిఖీలు నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో రైతుల ధాన్యం కొనకపోవడం వల్ల తడిస్తే బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు.