Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్లో తొలి గ్లోబల్ డెలివరీ సెంటర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఇంతకాలం అమెరికాకే పరిమితమైన డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీ క్వాలిజీల్ తన తొలి గ్లోబల్ డెలివరీ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పింది. బుధవారం హైదరాబాద్లో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్వాలిజీల్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ మధుమూర్తి రోనంకి మాట్లాడుతూ, 250 మంది సాంకేతిక ఉద్యోగులతో హైదరాబాద్ సెంటర్ నిర్వహిస్తున్నామనీ, రానున్న రెండేండ్లలో ఆ సంఖ్యను 1,500 మందికి పెంచనున్నట్టు తెలిపారు. భారతదేశంలో తమ సంస్థ కార్యకలాపాలను మరింత విస్తరించే ప్రణాళికలో భాగంగా హైదరాబాద్లో తొలి అడుగు వేశామని చెప్పారు. నాణ్యమైన ఇంజినీరింగ్ సేవలను ప్రపంచంలోని వినియోగదారులకు అందించేందుకు ఈ నగరం అనువైనదిగా భావించామన్నారు. దీన్ని హైదరాబాద్ లో నెలకొల్పేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ సీఈవో ప్రదీప్ గోవింద్ సామి మాట్లాడుతూ, తమ అంకుర సంస్థ అధినేతలుగా భారతీయులే ఉన్నారనీ, దాని సేవలను తిరిగి సొంత స్థలంలోకి తీసుకురావడంపట్ల హర్షం వ్యక్తం చేశారు.
అభినందనలు...జయేష్ రంజన్
క్వాలిజీల్ డెలివర్ సెంటర్ను హైదరాబాద్లో నెలకొల్పడం పట్ల రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఐటీ సంబంధిత కంపెనీలు, పరిశ్రమల స్థాపనకు తెలంగాణ, అందులోనూ హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారిందని తెలిపారు.