Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-సుజాతనగర్
కాసాని లక్ష్మి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బుధవారం కాసాని లక్ష్మి 5వ వర్ధంతి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల కేంద్రంలో సభ జరిగింది. ఈ కార్యక్రమానికి తమ్మినేని హాజరై జెండా ఆవిష్కరణ చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా మహిళలకు అండగా లక్ష్మి నిలబడ్డారని గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారన్నారు. మహిళలు లేకుండా ప్రపంచంలో ఏ ఉద్యమం లేదని, రానున్న రోజుల్లో పార్టీలో మహిళల ప్రాధాన్యత పెంచుతూ ''కాసాని లక్ష్మి మహిళా దళం'' తయారు చేసి ఆమె ఆశయాలను సాధిద్దామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మహిళలపై పెద్దఎత్తున దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్తు మాత్రం కమ్యూనిజం చేతుల్లోనే ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు కాసాని అయిలయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, కొత్తగూడెం సొసైటీ చైర్మెన్ మండే వీర హనుమంత రావు, పార్టీ జిల్లా నాయకులు కె.ధర్మ, వీర్ల రమేష్, కాట్రాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.