Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడ్డదారుల్లో గెలిచిండు
- పసుపు రైతుల ఆత్మగౌరవం తాకట్టు
- ధర్మపురి కాదు.. అధర్మపురి : ఎమ్మెల్సీ కవిత విమర్శలు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని హామీనిచ్చి రైతులను వంచించిన ఎంపీ ధర్మపురి అరవింద్‌ను వదలబోమని ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శలు గుప్పించారు. ఎంపీగా గెలిచిన ఈ మూడేండ్లలో ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలతో టైంపాస్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పర్యటనలో భాగంగా బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ వైఫల్యాలను ఎండగట్టారు. నిజామాబాద్ జిల్లాలో రైతు సమస్యలకు రాజకీయ రంగుపులిమి, అనేక అబద్ధాలు చెప్పి, తప్పుడు హామీలిచ్చి ఎంపీగా గెలిచారని ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు కోసం మూడేండ్లు అవకాశం ఇచ్చామని, ఇక నుంచి ప్రతి గ్రామంలో పసుపు బోర్డు ఏర్పాటుపై అరవింద్‌ను రైతులు నిలదీస్తారని తెలిపారు. 2014 మేలో తాను ఎంపీగా గెలిచాక.. పసుపు బోర్డు సాధించాలని జూన్ 2014 నుంచి 2018 జూన్ వరకూ అనేక కార్యక్రమాలు నిర్వహించానని గుర్తు చేశారు. 2017లో లోక్‌సభలో ప్రయివేటు బిల్లునూ ప్రవేశపెట్టానని వివరించారు. 2015లోనే నిజామాబాద్‌లో ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటైందని, 2017లోనే స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీని ప్రకటించారని, అప్పుడే డివిజనల్ ఆఫీస్ నిజామాబాద్‌లో ఏర్పాటయ్యిందన్నారు. కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం పసుపు రైతులకు 50 శాతం సబ్సిడీతో 250 బాయిలర్లను పంపిణీ చేశామని తెలిపారు.
ఓట్ల కోసం బాండ్ పేపర్ రాసిన ఎంపీ అరవింద్ పసుపు రైతులను మోసం చేశారని, పసుపు రైతులు సాంగ్లీకి పోవాలంటూ ఎంపీ అరవింద్ ఉచిత సలహాలు, ఉత్తుత్తి మాటలు చెప్తూ టైంపాస్ చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పైస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా పసుపు రైతుల కోసం 2020-21లో 1.18కోట్లు, 2021-22లో రూ. 74 లక్షలు మాత్రమే కేటాయించారని, ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆధారాలతో సహా ప్రకటించారు. ''తెలంగాణ వ్యాప్తంగా 90 వేల నుంచి లక్ష మంది పసుపు రైతులకు మూడేండ్లలో ఎంపీ అరవింద్ 1.92 కోట్లు తెచ్చారనీ, అంటే ప్రతి రైతుకు కనీసం 250 రూపాయల లబ్ది కూడా జరగలేదని ఆమె వివరించారు. మరోవైపు ఐదేండ్లలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రూ. 50 వేల కోట్లు అందించిందన్నారు. ఒకప్పుడు కరువుతో అల్లాడిన తెలంగాణలో, టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలతో నేడు పంట దిగుబడి అద్భుతంగా ఉందని తెలిపారు. అయితే పండిన పంటను కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కొనలేని పరిస్థితి ఉందని, కేంద్రం కూడా కొనాలని ఆందోళన చేశామన్నారు. ఎంపీ బండి సంజరు చేస్తున్నది పేరుకే సంగ్రామ యాత్ర అని, తెలంగాణ ప్రజలకు నిజమైన సంరక్షణ చేసేది ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. కాగా, ఎంపీ అరవింద్, రాజ్‌నాథ్‌సింగ్, రాం మాధవ్ వివిధ సందర్భాల్లో పసుపు రైతులకు ఇచ్చిన తప్పుడు హామీలకు సంబంధించిన వీడియోలను ఎమ్మెల్సీ కవిత మీడియా ముందు ప్రదర్శించారు. అబద్దాలతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ, చక్కగా పరిపాలన సాగుతున్న తెలంగాణలో, అనేక అసత్య ప్రచారాలతో కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని కవిత విమర్శించారు.