Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫీజు కడితేనే హాల్టికెట్లు ఇస్తామనడం సరికాదు : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మొత్తం ఫీజులు కడితేనే ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇస్తామంటూ శ్రీచైతన్య, నారాయణ సహా కార్పొరేట్ కాలేజీలు వ్యవహరించడం సరైంది కాదని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) రాష్ట్ర కమిటీ విమర్శించింది. ఆయా కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్ మూర్తి, కార్యదర్శి టి నాగరాజు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో ఈనెల ఆరో తేదీ నుంచి 24వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపధ్యంలో విద్యార్ధులకు హాల్ టిక్కెట్లు ఇవ్వాలంటే ఫీజులు కట్టాల్సిందేనంటూ కార్పొరేట్ కాలేజీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని తెలిపారు. తల్లిదండ్రులు, విద్యార్ధులు ఈ అంశాలను ఇంటర్ బోర్డు దృష్టికి తీసుకెళ్లినా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. కార్పొరేట్ యాజమాన్యాలకు వత్తాసు పలుకు తున్నారు తప్ప సమస్యను పరిష్కరించడం లేదని పేర్కొన్నారు. ఫీజులు చెల్లించిన తర్వాత ఉచితంగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చునంటూ బోర్డు ప్రకటించడం కంటితుడుపు చర్య అని తెలిపారు. ఫీజుల దోపిడీపైనా ఇంటర్ బోర్డు స్పందించదని విమర్శించారు. పరీక్షల సమయంలో హాల్ టిక్కెట్లు విద్యార్థులకు ఇవ్వకుండా కాలేజీలు ఇబ్బందులు పెట్టినా చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఒక్క నిమిషం ఆలస్యం కాకూడదంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఫీజుల దోపిడీ కనిపిస్తున్నా ఇంటర్ బోర్డు నిద్రపోతున్నదని విమర్శించారు. తక్షణమే ఈ సమస్యపై అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు.