Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సరఫరా బాధ్యత నుంచి తప్పుకున్న కేంద్రం
- సమన్వయం చేసుకోవడంలో టీఆర్ఎస్ సర్కార్ విఫలం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవస్థాగత లోపాలను సరిదిద్దకపోవడంతో రాష్ట్రంలో మరోసారి ఎయిడ్స్ మందుల కొరత ఏర్పడింది. కనీసం చిన్న పిల్లలకు కావాల్సిన మందులను సైతం అందుబాటులో ఉంచకపోవడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. సాధారణంగా మందుల సరఫరాను కేంద్రంలోని నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (న్యాకో) చేస్తుంది. అయితే ఆ బాధ్యత నుంచి న్యాకో తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతున్నది. మందులను ముందుగా రాష్ట్రాలే కొనుగోలు చేసి ఇచ్చేలా, ఆ తర్వాత నిధులను తాను విడుదల చేయాలని న్యాకో భావిస్తున్నట్టు తెలుస్తున్నది. దీంతో రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా బాధితులకు సకాలంలో ఉచిత మందుల సరఫరాలో అంతరాయం కలుగుతున్నట్టు హెచ్ఐవీ బాధిత సంఘాలు చెబుతున్నాయి.
రాష్ట్రానికి ఏ మేరకు మందులు అవసరమనే దానిపై న్యాకోకు సకాలంలో ప్రతిపాదనలు అందడం లేదనీ, అందుకే అక్కడి నుంచి మందుల సరఫరాలో అంతరాయం ఏర్పడిందనే వాదన కూడా ఉన్నది. న్యాకో, రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీల మధ్య సమన్వయ లేమితో బాధితులను ఇబ్బంది పెట్టడం సరికాదనీ, తక్షణమే మందులు సరఫరా చేయాలని ఇప్పటికే హెచ్ఐవీ బాధితుల జాతీయ స్థాయి నెట్ వర్క్ బృందం న్యాకో దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. రాష్ట్రాల్లో ఆ నెట్ వర్క్ నాయకులు ఆయా రాష్ట్రాల ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలకు ఈ మేరకు ఇప్పటికే విన్నవించాయి. అయితే అధికారులు దిద్దుబాటు చర్యలను వేగవంతం చేయకపోవడంతో ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని బాధితులకు మందులను కొనుక్కోవాల్సి వస్తున్నది.
అయితే ఎయిడ్స్ మందుల వాడకంలో అంతరాయం ఉండకూడదనీ, క్రమం తప్పకుండా చూసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఉచిత సరఫరాపై ఆధారపడిన పేద రోగులకు అనివార్యంగా డబ్బులు వెచ్చించి బయట కొనుక్కోవాల్సి వస్తున్నది. దీంతో ఒక్కో మందుకు రూ.ఒక వెయ్యి నుంచి రూ.రెండు వేల వరకు ఖర్చవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేయాల్సి వస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బంది కలుగుతున్నదని వారు చెబుతున్నారు.
బాధితుల పట్ల నిర్లక్ష్యం....
మందులను అందుబాటులో ఉంచాలని ఒక ఉన్నతాధికారిని కలిసి బాధితులు కోరితే నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్టు బాధితులు తెలిపారు. సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్‌కు అదనపు బాధ్యతలు ఉండటం, జాయింట్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో అన్ని పనులను ప్రస్తుతం అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న అధికారినే పర్యవేక్షిస్తున్నారు. దీంతో ప్రతి అంశంలోనూ తీవ్ర జాప్యం జరుగుతున్నదని పలువురు పేర్కొంటున్నారు. జేడీ పోస్టుల భర్తీ విషయమై ప్రాజెక్ట్ డైరెక్టర్ చేసిన ప్రతిపాదనలు కార్యరూపం దాలిస్తే సమస్యల నుంచి గట్టెక్కవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే సొసైటీలోనే జేడీ పోస్టులు భర్తీ కాకుండా కొంత మంది అధికారులు అడ్డుకుంటున్నారనే కూడా ఆరోపణలున్నాయి.