Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు సీజన్ల బిల్లులు పెండింగ్
- ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టతరం
- అప్పులు చేసి కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లు
- ఉమ్మడి జిల్లాలో రూ.29 కోట్ల బిల్లు పెండింగ్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు నుంచి ధాన్యం సేకరించిన ఏజెన్సీలకు ఏడాదిన్నరగా కమీషన్లు అందక నిర్వహకులు అల్లాడిపోతున్నారు. మార్కెట్ కేంద్రంలో పనిచేసిన ఉద్యోగులకు వేతన చెల్లింపులు లేక.. నిర్వహణ ఖర్చులకు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మళ్లీ యాసంగి ధాన్యం సేకరణకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఏజెన్సీలు పీఏసీఎస్, ఐకేపీలను కోరగా ససేమీరా అంటున్న పరిస్థితి. పెండింగ్ బిల్లులు చెల్లిస్తే తప్ప ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తానన్న ధాన్యం సేకరణకు ఎవరు ముందుకు వచ్చేట్టు లేరని రైతులు గందరగోళానికి గురవుతున్నారు. ప్రభుత్వం తక్షణమే ధాన్యం సేకరణ ఏజెన్సీలకు ఇవ్వాల్సిన కమీషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఏడాదిన్నరగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు అందాల్సిన కమీషన్లు అందకపోవడంతో ఈ ఏడాది కొనుగోలు కేంద్రాల ప్రారంభానికి మొగ్గు చూపడం లేదు. జిల్లాలో గతేడాది రెండు సీజన్లో 187 సెంటర్ల ద్వారా 64,142 మెట్రిక్ టన్ను ధాన్యం సేకరించగా ఇందుకు గాను ధాన్యం సేకరణ ఏజెన్సీలకు క్వింటాలుకు రూ.312 చొప్పున కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన 2020-21 ఏడాది వానాకాలం, యాసంగిలో ఏజెన్సీలు సేకరించిన ధాన్యానికి ప్రభుత్వం చెల్లించే కమీషన్ రూ.20 కోట్లు. ఈ ఏడాది వానాకాలంలో ఉమ్మడి జిల్లాలో 201 కొనుగోలు కేంద్రాల నుంచి 28,615 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఇందుకు ఏజెన్సీలకు చెల్లించాల్సిన కమీషన్ రూ. 8.92 కోట్లు. జిల్లాలో మొత్తంగా మూడు సీజన్లకు సంబంధించి ఏజెన్సీలకు అందాల్సిన కమీషన్ సుమారు రూ. 30 కోట్లు పెండింగ్లో ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. పెద్ద మొత్తంలో కమీషన్ పెండింగ్లో ఉండటంతో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి ఏజెన్సీలు ముందుకు వస్తలేవని అధికారులు వాపోతున్నారు. 'వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ మండలం పీఏసీఎస్ ఆధ్వర్యంలో మూడు సీజన్లుగా సేకరించిన ధాన్యానికి కమీషన్ కింద ప్రభుత్వం నుంచి సుమారు రూ. 20 లక్షలు రావాల్సి ఉందని పీఏసీఎస్ చైర్మెన్ వాపోతున్నారు. ఈ ఏడాది వానాకాలంలో 32 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించడం జరిగింది. ఇందుకు నిర్వహణ ఖర్చులు కింద సమారు రూ.5 లక్ష వరకు వచ్చిందని నిర్వహకులు చెబుతున్నారు. బొంరాస్పేట పీఏసీఎస్ పరిధిలో మూడు సీజన్లల్లో సేకరించిన ధాన్యానికి రావాల్సిన కమీషన్ సుమారు రూ. 30లక్షలు ఉందని అధికారులు తెలుపుతున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ఏర్పాటు చేసిన ఉద్యోగులకు వేతనాలు చెల్లింపులు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో పనిచేసేందుకు ఉద్యోగులు ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి లేదని నిర్వహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహణ కష్టతరం
ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ఖర్చులు మేము భరించలేమని ధాన్యం సేకరణ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సీజన్లుగా కేంద్రాల నిర్వహణకు పెట్టిన ఖర్చులు నేటికి రాలేదు.. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి.. మళ్లీ కేంద్రాలు ప్రారంభించాలంటే.. నిర్వహణ ఖర్చులు ఎక్కడి నుంచి తేవాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు వాపోతున్నారు. ఐకేపీ (ఇందిరా క్రాంతి పథం) కింద మహిళ సంఘాల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి అందాల్సిన కమీషన్లు సైతం అందకపోవడంతో మహిళలు నానాతంటాలు పడుతున్నారు. అప్పులు చేసి కొనుగోలు కేంద్రాల నిర్వహణకు ఖర్చుపెట్టాం. ఏడాదిన్నర కమీషన్ అందడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కమీషన్ డబ్బులు ఎప్పుడు వస్తాయే తెలియడం లేదు. అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం మా గోస చూసైన తక్షణమే ధాన్యం సేకరణకు ఇవ్వాల్సిన కమీషన్ విడుదల చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వహకులు డిమాండ్ చేస్తున్నారు.
కొనుగోలు కేంద్రాల నిర్వహకులకు సకాలంలో కమీషన్లు ఇవ్వాలి
మూడు సీజన్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అందాల్సిన కమీషన్లు అందక పోవడంతో ప్రస్తుతం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి ఏజెన్సీలు ముందుకు రావడం లేదు. ఈ ప్రభావం రైతులపై పడనుంది. ప్రభుత్వం ప్రతి గింజా కొనుగోలు చేస్తానంటుంది.. కానీ వాటిని సేకరించే ఏజెన్సీలకు ఇప్పటికీ కమీషన్లు ఇవ్వకుండా ఏట్లా సేకరిస్తారు. తక్షణమే కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ఇవ్వాల్సిన కమీషన్ డబ్బులు మంజూరు చేయాలి.
- మదుసుధన్ రెడ్డి,
తెలంగాణ రైతు సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి