Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కట్టినా లబ్దిదారులకు అందజేయని దుస్థితి
- దరఖాస్తులెక్కువ...ఇండ్లు తక్కువ
- పంపిణీకి శ్రీకారం చుడితే ఆగ్రహజ్వాలలే...
- తలలు పట్టుకుంటున్న అధికారులు
- ఎమ్మెల్యేలు సైతం విముఖత
- ఒకరికిస్తే ఐదారు కుటుంబాలు దూరమవుతాయనే భయం
- సొంత జాగ ఉన్నవారికి మూడు లక్షలందుకే...
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఇల్లులేని పేదవాడికి టీఆర్ఎస్ సర్కారు...ప్రభుత్వ ఖర్చుతోనే డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామంది. ఈమేరకు ఆ పార్టీ గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రజలకు ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అదే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ మెడకు ఉరితాడైంది. పేదల కోసం ప్రభుత్వం ఇండ్లు నిర్మించినప్పటికీ వాటిని అర్హులకు పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. మరోవైపు దరఖాస్తు చేసుకున్న పేదలు తమ ఇండ్ల కల ఎప్పుడు నెరవేరుతుందోనని ఎదురు చూస్తున్నారు. లబ్దిదారులకు పంపిణీ చేయాలో, వద్దా అనే విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికారులు ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లు ప్రకటించగానే దాదాపు ఏడులక్షల మంది నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. అందులో మూడు లక్షల మందిని ప్రభుత్వం అర్హులుగా గుర్తించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు సరిపడినన్నీ ఇండ్లు నిర్మించకపోవడంతో కథ అడ్డం తిరిగింది. హైదరాబాద్‌లో లక్ష ఇండ్లు నిర్మించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో నిర్మించినవి 85వేల ఇండ్లే. అందులో ఇండ్ల నిర్మాణం కోసం స్థలాలు ఇచ్చిన 4500 మందికి డబుల్‌బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేశారు. మిగతా 95500 ఇండ్లు పంపిణీ చేయాలంటే సర్కారుకు చుక్కలు కనిపిస్తున్నాయి. పూర్తయిన ఇండ్లను పంపిణీ చేసేందుకు జంకుతున్నది. ఆ ఇండ్లను పంపిణీ చేస్తే మిగతా అర్హుల నుంచి ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యే పరిస్థితులున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇప్పటికీ పంపిణీ చేయడంలేదు. చాలా చోట్ల ఇండ్లు నిర్మించినప్పటికీ అవి నిర్మాన్యుషంగా మారాయి. గూడులేని పేదలు ఇంకా మూడు లక్షల మంది ఉన్నట్టు గుర్తించిన ప్రభుత్వం...అందుకు అనుగుణంగా ఇండ్ల నిర్మాణం చేపట్టలేదు. డబుల్‌బెడ్ రూమ్ ఇండ్ల కోసం పేదల నుంచి అభ్యర్థన కారణంగా ఇప్పటికిప్పుడు పంపిణీ చేస్తే మిగతా అర్హులకు సమాధానం చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ అంశాన్ని గమనించిన స్థానిక ఎమ్మెల్యేలు సైతం ఇండ్ల పంపిణీ ప్రక్రియ లేకుండా జాగ్రత్తలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన లెక్కల ప్రకారం ఒకరికి ఇల్లు కేటాయించడం ద్వారా ఐదారు మంది అసంతృప్తికి గురయ్యే ప్రమాదమున్నది. ఈ క్రమంలో రానున్న ఎన్నికల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రెండు పడక గదుల ఇండ్ల పంపిణీ తాత్కాలికంగా నిలిపివేయడమే మార్గమని సర్కారు భావిస్తున్నది. ఎన్నికల సమయంలో వాటి జోలికి పోతే తేనే తుట్టేను కదిపినట్టేనని ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇండ్ల జోలికి పోవడం కంటే జాగా ఉన్న వారికి మూడు లక్షలు ఇవ్వడం ఉత్తమమని చెబుతున్నారు. తద్వారా ఎక్కువ మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూర్చాలని భావిస్తున్నది. అయితే ఇప్పటికే నిర్మించిన, నిర్మాణ దశలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏం చేయాలనే దానిపై కసరత్తు మాత్రం జరగడం లేదు. వాటి పరిస్థితి ఎలా ఉన్నా...ప్రభుత్వానికి ఇండ్ల సమస్య చాలా పెద్దదిగా మారిందని అధికారులు వాపోతున్నారు.