Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చందుర్తి
రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్‌లో అమానుష ఘటన జరిగింది. ఓ మూగ బాలికపై లైంగికదాడి జరిగింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..
మూగబాలిక(13)పై అదే గ్రామానికి చెందిన శీలం లచ్చయ్య, కొమ్మనపల్లి కనకయ్య మూన్నెళ్ల కిందట సామూహిక లైంగికదాడి చేశారు. ఈ క్రమంలో బాలిక తరచూ అనారోగ్యానికి గురవుతుండటంతో తల్లిదండ్రులు వేములవాడలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చూపించారు. బాలిక గర్భం దాల్చినట్టు వైద్యులు తెలిపారు. దీంతో బాలికను వివరాలు అడగ్గా తనపై జరిగిన లైంగికదాడి గురించి సైగల ద్వారా చెప్పింది. అయితే, విషయం బయటకు పొక్కకుండా కొందరు గ్రామ పెద్దలు శీలం లచ్చయ్యను గల్ఫ్‌కు పంపించినట్టు తెలిసింది. దీంతో బాధిత బాలిక తల్లి తమకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కొమ్మనపల్లి కనకయ్యను అరెస్టు చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.