Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సర్వంసిద్ధమైంది. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,768 మంది కలిపి మొత్తం 9,07,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వారికోసం 1,443 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం 25 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు 1,443 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఇంటర్ బోర్డు నియమించింది. ఈ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు జిల్లా పరీక్షల కమిటీ (డీఈసీ)లను ఏర్పాటు చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షా కేంద్రాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బెంచీకి ఒకరు, తరగతి గదికి 24 మంది నుంచి 30 మంది విద్యార్థుల వరకు కూర్చుని పరీక్షలు రాసేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండదు. సకాలంలో చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. అందుకే ఒకరోజు ముందుగానే పరీక్షా కేంద్రానికి వెళ్లి చూసుకోవాలని ఎంత దూరం ఉంది, ఇంటి నుంచి లేదా హాస్టల్ నుంచి ఎంత సమయంలో వెళ్లడానికి వీలవుతుందన్న అవగాహన వస్తుందని అధికారులు చెప్తున్నారు. ఇంకోవైపు ఫీజు చెల్లిస్తేనే హాల్టికెట్లు ఇస్తామంటూ ప్రయివేటు, కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు కొందరు విద్యార్థులను భయాందోళనలకు గురిచేస్తున్నాయనే ఫిర్యాదులు రావడంతో ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాట్టికెట్లను డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వాటిపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం లేదంటూ ప్రకటించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అధికారులు నిర్ణయించారు.