Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-యాదాద్రి
యాదగిరిగుట్టలో బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి గుట్ట ఆలయ అభివృద్ధి పనులు పైన పటారం.. లోన లోటారం అన్న చందంగా ఉన్నాయి. ప్రభుత్వ పెద్దలు, అధికారుల డొల్లతనం గాలివాన దెబ్బకు బయటపడింది. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను అందరు కలిసి మోసపుచ్చారు. ఏ వీఐపీ క్షేత్ర సందర్శనకు వచ్చిన అద్భుతం..మహా అద్భుతం.. చరిత్రకారుడు కేసీఆర్ అని శ్లాఘించారు. ఆ పొగడ్తలే ఇప్పుడు కొంపముంచాయి. ఆలయంలో చేపట్టిన పనులన్నీ దాదాపు ద్వంసమయ్యాయి. వర్షం దాటికి ఉత్తర దిశలో మూడవ ఘాట్ చివరన రోడ్డు ఎక్కడికక్కడ కుంగిపోగా ఇదే రోడ్డు వెంట పలుచోట్ల కోతకు గురయ్యాయి. సత్యదేవుని వ్రతం, వాహన పూజలు చోట చెట్లు కూలిన సమయంలో భక్తులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో నాసిరకం పనులను బయటపెడ్డాయి. క్యూలైన్లలోకి వర్షం నీరు చేరింది. కొన్నిచోట్ల ఫిల్లర్ల వద్ద నీళ్లు లీకవుతున్నాయి. రహదారులపై ఎక్కడికక్కడ వరద నీరు నిలిచింది. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్టాండ్ బురద మయంగా మారింది. గుట్టపై ఏర్పాటు చేసిన చలువ పందిళ్లు ఎక్కడికక్కడ నేలమట్టం అయ్యాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్ముక్కై వరద పాటు గుర్తెరుగకుండా చేసిన పనులు నాసిరకమని తేలిపోయింది. కాగా మున్ముందు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భక్తులు ఆందోళన పడుతున్నారు. మొదటి ఘాట్ సమీపంలో కొండపై నుండి కొట్టుకొచ్చిన మట్టి...బురదమయం కాగా బస్సుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భక్తులు ఆ బురదలోనే నడకసాగించారు. రింగ్ రోడ్ లో ఊరకుంట అలుగు ప్రదేశంలో ఆర్ అండ్ బి అధికారులు డివైడర్ ను తొలగించి వర్షం నీరు వెళ్లడానికి దారి చేశారు. కాగా లక్ష రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్థంభం గాలికి నెలకొరిగింది.
దక్షిణ పశ్చిమ భాగంలో కల అష్టభుజి ప్రాకారాలు వర్షపు లీకేజీలు కలిగాయి. వర్షపు నీటిలో తడచిన లడ్డూ ప్రసాదాలను ఆరబెట్టి తిరిగి వీఐపీ దర్శనం (రూ. 150) టికెట్ దారులకు విక్రయించారు. ఆలయ అతిథి గహం పక్కన ఏర్పాటుచేసిన కొబ్బరి చెట్లు గాలివాన దాటికి కూలిపోయాయి.