Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలకు చేసిందేమీ లేదుమోడీ సర్కార్‌పై సెటైర్లు
- రాహుల్ ఎందుకొస్తున్నావ్.. ఏం చెప్తావ్.. : ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు
- జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మాతాశిశుఆరోగ్య కేంద్రాలు ప్రారంభం
నవ తెలంగాణ -పెద్దపల్లి/జగిత్యాల
బీజేపీ, కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ ఈ నెల 6న రాష్ట్రానికి ఎందుకు వస్తున్నావనీ, ఏం చెప్పడానికి వస్తున్నావని మంత్రి ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ.. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప.. ప్రజలకు చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. జగిత్యాలలో 260 పడకల ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని, పెద్దపల్లిలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయాచోట్ల మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. నాడు సర్కారు దవాఖానకు రావాలంటే జంకేవారనీ, నేడు పరిస్థితులు మారాయని తెలిపారు. కేసీఆర్ కిట్ ప్రభావంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 నుంచి 56 శాతానికి ప్రసవాలు పెరగాయన్నారు. రాష్ట్రంలో నిర్వహించిన ఇంటింటా జ్వర సర్వే మంచి ఫలితాలు అందించిందని, నీటి ఆయోగ్ సైతం రాష్ట్రాన్ని ప్రశంసించిందన్నారు. ఆశా కార్యకర్తలకు గుజరాత్, యూపీల్లో రూ.3-4 వేలు వేతనాలు మాత్రమే అందిస్తున్నారని, తెలంగాణలో సీఎం కేసీఆర్ రూ.1500 నుంచి రూ.9750 పెంచారని తెలిపారు. జగిత్యాల జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో 44శాతం ప్రసవాలు జరుగుతున్నాయని, రూ.18 కోట్ల వ్యయంతో 100 పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రం నిర్మించామని, వీటిల్లో 6 మాసాల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని కోరారు. జగిత్యాలలో 80 శాతం మేర సిజేరియన్ ఆపరేషన్లు జరుగుతున్నాయని, గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. ముహూర్తాలు చూసుకొని సిజేరియన్లు చేయడాన్ని నివారించాలని ఆదేశించారు. కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ రాష్ట్రానికి వస్తున్నారనీ, రైతు సంఘర్షణ సభ పెడుతామని అంటున్నారని.. ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలు, ఎరువులు, విత్తనాలు కొరత, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లని ఆరోపించారు. వ్యవసాయం విషయంలో కేంద్రం రైతులను మోసం చేస్తున్నదని, వడ్లు కొనం అంటే ఎంత ఖర్చు అయినా రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేసేందుకు సీఎం చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. కేంద్రం బీఎస్ఎన్ఎల్, విశాఖ ఉక్కు, ఎల్ఐసీ, రైల్వే అన్ని అమ్ముతున్నారని, ఉద్యోగాలు మాత్రం ఇస్తలేరన్నారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టమంటున్నారని, గ్యాస్, పెట్రోల్, అన్ని ధరలు పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.