Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- పొంగిపొర్లిన డ్రయినేజీలు, కుంగిన ప్రధాన రోడ్లు
- కూలిన హోర్డింగ్స్, చెట్లు
- పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి డ్రయినేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి. ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయాయి. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. భారీ వర్షం పాతబస్తీని కుదిపేసింది. యాకుత్‌పురా నియోజకవర్గంలోని మదీనానగర్, ధోభీఘాట్ తదితర లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు ముంచెత్తింది. ఇండ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. చార్మినార్, మలక్‌పేట్, బహదూర్‌పురా, చాదర్‌ఘాట్‌లో హోర్డింగ్స్ విరిగిపడ్డాయి. కుండపోత వర్షానికి పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగాయి. తిలక్‌నగర్ వద్ద భారీ వృక్షం కూలింది. బహదూర్‌పురా నియోజకవర్గంలోని మక్కాకాలనీ, యష్రప్‌నగర్ తదితర ముంపు ప్రాంతాల్లో వరదనీరు చేరడంతో ట్యూబ్ బోటు సహాయంతో స్థానికులను సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. హైదర్‌గూడ నుంచి బషీర్‌బాగ్ వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
చెరువులను తలపించిన రోడ్లు
నగరంలో పలు ప్రాంతాల్లో వరద పోటెత్తింది. సరూర్‌నగర్, ఎన్టీఆర్నగర్, పాతబస్తీలో కాలనీలు, రోడ్లు చెరువులను తలపించాయి. పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్ రోడ్లపై మోకాళ్లలోతులో నీరు చేరింది. ఎల్బీనగర్ ఫ్లై ఓవర్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ బస్సు వరదనీటిలో చిక్కుకుంది. ఎల్బీనగర్ రోడ్డుపై ఏర్పడిన గుంతలో కారు ఇరుక్కుపోయింది. నల్లకుంటలో రోడ్డు కుంగిపోయింది.
సీతాఫల్మండి, బన్సీలాల్‌పేట్‌లో అత్యధికం
అత్యధికంగా సీతాఫల్మండిలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక బన్సీలాల్‌పేటలో 6.7, వెస్ట్ మారేడుపల్లిలో 6.1, అల్వాల్‌లో 5.9, ఎల్బీనగర్లో 5.8, బాలానగర్‌లో 5.4, ఏఎస్‌రావ్ నగర్లో 5.1, బేగంపేట పాటిగడ్డలో 4.9, మల్కాజ్‌గిరిలో 4.7, ఫలక్‌నుమాలో 4.6, గన్‌ఫౌండ్రీలో 4.4, కాచిగూడ, సికింద్రాబాద్‌లో 4.3, చార్మినార్‌లో 4.2, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1, అంబర్‌పేటలో 4, అమీర్‌పేట, సంతోష్‌నగర్‌లో 3.7, ఖైరతాబాద్‌లో 3.6, బేగంబజార్, హయత్‌నగర్, చిలుకానగర్‌లో 3.5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
కాస్త ఉపశమనం
కొన్ని రోజులుగా ఎండవేడిమి, వడగాడ్పు, ఉక్కపోతతో అల్లాడుతున్న నగర వాసులకు అకాల వర్షంతో ఉపశమనం లభించినట్టయింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో పలుప్రాంతాల్లో వర్షం కురిసింది. మరో రెండ్రోజులపాటు వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇప్పటికే వెల్లడించింది.