Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారీ వాన.. తడిసిన ధాన్యం
- కల్లాల్లో కొట్టుకుపోయిన గింజలు
- నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు
- పలుచోట్ల పిడుగులు
- మృత్యువాతపడిన మూగజీవాలు
- గొర్రెల మంద నుంచి ఇంటికి వస్తున్న యువకుడు మృతి
నవతెలంగాణ- మొఫసిల్ యంత్రాంగం
అకస్మాత్తు.. అకాల వర్షం రైతులను నట్టేట ముంచింది. అసలు కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభమవ్వగా.. వర్షానికి ఎక్కడికక్కడ ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. రాత్రంతా ఉక్కపోత.. వేడి సెగలు కక్కిన వాతావరణం బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులు మొదలై రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల పిడుగులు పడి మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. ఓ యువకుడు ప్రాణం కోల్పోయాడు. మార్కెట్ యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం రాశుల చుట్టూ నీరు చేరింది. వరదలో ధాన్యం కొట్టుకుపోయింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు పంటలను పరిశీలించారు.
పెద్దపల్లి జిల్లాలో మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసిపోయింది. మంథని మార్కెట్‌యార్డు, పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోగా.. ధాన్యం కుప్పల చుట్టూ చేరిన వర్షపు నీటిని రైతులు తొలగించారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 20 రోజులు దాటినా తూకం వేయలేదని రైతులు వాపోయారు. సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో సుమారు 25వేల క్వింటాళ్ల ధాన్యం తడిసింది. టార్ఫాలిన్లు అందుబాటులో లేకపోవడంతో పెద్దపల్లి మార్కెట్లో వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యం రాశులు నీటిపాలయ్యాయి. సుమారు వంద క్వింటాళ్ల వరకు నీటిలో కొట్టుకుపోయినట్టు రైతులు చెబుతున్నారు.
కరీంనగర్ జిల్లాలో అకాల వర్షానికి హుజూరాబాద్, జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో ధాన్యం నీటిలో కొట్టుకుపోయింది. ఇల్లందకుంట, వీణవంక మండలాల్లో రోడ్డు పక్కన ఆరబోసిన ధాన్యంకొట్టుకుపోయింది. గంగాధర మార్కెట్‌యార్డులోనూ సమారు వెయ్యి క్వింటాళ్ల ధాన్యం తడిసి ముద్దయింది. కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి మేడిపల్లి సత్యం రైతులను పరామర్శించారు. అయితే, కరీంనగర్ జిల్లాలో వర్షం ప్రభావం పెద్దగా లేదని వ్యవసాయాధికారులు తెలిపారు. సుమారు జిల్లా వ్యాప్తంగా 350 ఎకరాల్లో వరి నేల వాలినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు.
జగిత్యాల జిల్లాలో వరి కోతలు ఆలస్యం కావడంతో వర్షానికి పెద్దఎత్తున పైరు నేలవాలింది. ప్రధానంగా బుగ్గారం, ధర్మపురి, సారంగాపూర్, వెల్గటూర్, గొల్లపల్లి మండలాల్లో అత్యధికంగా నష్టం వాటిల్లింది. అధికారుల లెక్కల ప్రకారమే.. ఈ మండలాల్లోని 30 గ్రామాల్లో 1619 మంది రైతులకు చెందిన 2340 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జగిత్యాల మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పరిశీలించారు. ధర్మపురి, రాయపట్నం సహా పలు గ్రామల్లో విద్యుత్‌స్తంభాలు నేలకొరిగి విద్యుత్ అంతరాయం ఏర్పడింది. పలు గ్రామాల్లో బుధవారం రాత్రి వరకు కరెంటు తీగల మరమ్మతులు పూర్తికాలేదు. మల్యాల మండలంలో బల్వంతాపూర్‌లో పిడుగుపాటుకు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే గ్రామంలో 43 మేకలు మృత్యువాతపడ్డాయి.
రాజన్నసిరిసిల్ల జిల్లాలో సుమారు 1500 ఎకరాల్లో వరి నేలవాలింది. వ్యవసాయాధికారుల లెక్కల ప్రకారం.. జిల్లా వ్యాప్తంగా 736 మంది రైతులకు చెందిన 1080 ఎకరాల్లో వరి నేల వాలినట్టు తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి పంపిస్తామని జిల్లా వ్యవసాయాధికారి రణధీర్ తెలపిఆరు.
మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం
వర్షం మంచిర్యాల జిల్లాను అతలాకుతలం చేసింది. పంట పొలాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కల్లాల్లో పెట్టిన వరి ధాన్యం తడిసిముద్దయింది. ఈ ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు పడరానిపాట్లు పడుతున్నారు. రబీలో వేసిన పంటలన్నీ ఈదురుగాలుల దాటికి నేలకూలాయి. వేలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. జన్నారం మండలంలో గాలివాన భీభత్సానికి ఇండ్ల పైకప్పులు లేచిపోయాయి. ఈ ఘటనలో కిష్టాపూర్ గ్రామానికి చెందిన ఒడిపెల్లి మల్లేష్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆయా మండలాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
హన్మకొండ జిల్లాలో కమలాపూర్ మండలంలోని కమలాపూర్, గూడూరు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. ధర్మసాగర్ మండలంలో 20 లారీల ధాన్యం తడిసింది. జనగామ జిల్లాలో 2500 ఎకరాల్లో వరి పైరు వర్షానికి దెబ్బతిన్నది. జనగామ మండలంలోని ఎల్లండలో బండపై ఆరబెట్టిన 200 బస్తాల ధాన్యం తడిసిపోయింది. ఈదురు గాలులకు ఎల్లంల, గోపిరాజుపల్లి, పసరమడ్ల గ్రామాలలో మామిడి కాయలు నేలరాలాయి. లింగాలఘనపురం మండలంలో 108 ఎకరాల వరి పంట నేలకొరిగినట్టు ఏఓ తెలిపారు. బచ్చన్నపేట మండలంలో ఉన్న 26 గ్రామాలకుగాను 23 గ్రామాల్లో 13 ఐకెపి, 10 పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో కొనుగోలు కేంద్రంలో సుమారుగా 100 బస్తాల వరకు తడిసి ముద్దయ్యాయి. వ్యవసాయ అధికారుల అంచనా ప్రకారం 650 ఎకరాల వరకు వరి ధాన్యం నేలకొరిగింది. భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం తాడిచెర్లతోపాటు మల్లారం, పెద్దతూండ్ల, ఎడ్లపల్లి, నాచారం గ్రామాల్లో వరి, మామిడి పంటలు నేలపాలయ్యాయి.
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం మోతే ఐకెపీ సెంటర్లోని ధాన్యం తడిసి ముద్దైంది. రాయపోల్ మండలంలోని కొత్తపల్లి, రామారం, గొల్లపల్లి, రాంసాగర్, తిమ్మక్‌పల్లి, టెంకంపేటలో గల కొనుగోలు కేంద్రాలలోనూ ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. తొగుంట మండలంలో కోత దశలో ఉన్న చేరుకు వరి పంట దెబ్బతింది. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కొనుగోలు కేంద్రాలను, కల్లాలను పరిశీలించారు. రైతులు అధైర్య పడొద్దని, ప్రభుత్వం ప్రతిగింజనూ కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. మిరుదొడ్డి మండలం లక్ష్మీనగర్ గ్రామంలో పిడుగుపాటుకు ఓ ఎద్దు మృత్యువాత పడింది. మద్దూరు మండలం వంగపల్లి గ్రామానికి చెందిన రైతు ఎర్ర బచ్చల భిక్షపతికి చెందిన రెండు ఎడ్లు పిడుగుపాటుకు మృత్యువాతపడ్డాయి. బెక్కల్‌లో కూకట్ల రాజలింగానికి చెందిన నాలుగు గొర్రెలు విద్యుత్‌షాక్‌తో మృత్యువాత పడ్డాయి. వర్గల్ మండలం మీనాజీపేట్లో విద్యుత్ స్తంభం రోడ్డుపై విరిగి పడటంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడలో 70 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తీవ్ర నష్టం
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూర్ వ్యవసాయ మార్కెట్లో పోసిన ధాన్యపు రాసులు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. పాలడుగు గ్రామంలో పిడుగుపాటుతో రైతు కొప్పుల సుదర్శన్ రెడ్డి గేదె, దాచారంలో బొబ్బలి లింగయ్యకు చెందిన 10 గొర్రెలు చనిపోయాయి. రామన్నపేట మండలంలో దుబ్బాక, మునిపంపుల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యపు రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. సుంకిపల్లి గ్రామంలో పిడుగుపాటుకు రెండు ఎద్దులు మృతువాతపడ్డాయి. రాజాపేటలో ధాన్యం తడిసిపోయింది. వలిగొండ మండలం టేకులసోమారం గ్రామంలో 30 ఏకరాల మామిడి తోటలో కాయలు నేలరాలాయి. నల్లగొండ జిల్లా చండూరు వ్యవసాయ మార్కెట్లో, మాడుగులపల్లి మండలం గోపాలపురం పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది.
నకిరేకల్ మండలం మోదుగునేని గూడెంలో పిడుగుపాటుకు 26 ఏండ్ల యువకుడు మృతిచెందాడు. డొంకతండా కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన 700 బస్తాల లోడ్ లారీ తడిసి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. రాగడప ఐకేపీ సెంటర్‌ను డిప్యూటీ తహసీల్దార్ గాదె సైదులు, ఆర్ఐ గుండెబోయిన సైదులు యాదవ్, పీఏసీఎస్ చైర్మెన్ జయరాం, నాయకులు సందర్శించారు. మర్రిగూడ మండలంలో లెంకలపల్లిలో పలు ఇండ్లపై రేకుల కప్పులు లేచిపోయాయి. మామిడికాయలు, నిమ్మ, బత్తాయి, కూరగాయలు తదితర పంటలు సైతం దెబ్బతిన్నాయి.
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల వద్ద నిల్వ ఉంచిన ధాన్యం తడిసిముద్దయింది. పలుచోట్ల ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల ధాటికి కోతకు వచ్చిన పైరు నేలవాలింది. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా ప్రారంభించగా, సకాలంలో కొనుగోలు చేపట్టకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని, తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని రైతులు కోరుతున్నారు.