Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ల్యాండ్ పూలింగ్ వద్దు
- వ్యవసాయమే చేసుకుంటాం..
- ఎమ్మెల్యే 'చల్లా' ఇంటి ముందు నిరసన
- 'కుడా' ఎదుట రైతుల ధర్నా
- వరంగల్ కలెక్టరేట్లో నిరసన
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ జిల్లా వరంగల్, గీసుగొండ మండలాల రైతులు ల్యాండ్ పూలింగ్‌కు మా భూములు ఇవ్వబోమని స్పష్టం చేశారు. రెండు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్‌కు అడగడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఉదయం హన్మకొండలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటి వద్ద రైతులు నిరసన తెలిపారు. అనంతరం 'కుడా' కార్యాలయం ముందు ధర్నా చేశారు. అన్నదాత సుఖీభవ, ల్యాండ్ పూలింగ్ను వెంటనే రద్దు చేయాలి.. రైతుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.
అనంతరం 'కుడా' ప్లానింగ్ ఆఫీసర్ అజిత్‌రెడ్డికి వినతిపత్రం అందచేశారు. అక్కడి నుంచి వరంగల్ కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోయారు. కలెక్టర్ బి.గోపికి వినతిపత్రం అందజేశారు. ల్యాండ్ పూలింగ్ వద్దు.. వ్యవసాయమే ముద్దు అంటూ కలెక్టరేట్ ఎదుట పెద్దపెట్టున నినాదాలు చేశారు.
తాజాగా 21 వేల 240 ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్‌లో తీసుకోనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని మొగిలిచర్ల, గొర్రెకుంట, పోతరాజుపల్లి, కొత్తపేట, పైడిపెల్లి గ్రామాలకు చెందిన రైతులు, వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందిన ఆరేపల్లి రైతులు ల్యాండ్ పూలింగ్ను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ల్యాండ్ పూలింగ్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఎమ్మెల్యే రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ల్యాండ్ పూలింగ్ ఆపకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ల్యాండ్ పూలింగ్ విషయంలో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు పంటలు పండే భూమిని లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ భూముల కోసం ప్రాణ త్యాగానికైనా వెనుకాడబోమని హెచ్చరించారు. రైతుల నోటికాడి బుక్కను నాశనం చేయొద్దన్నారు. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ఇనుగాల వెంకట్రాంరెడ్డికి వినతిపత్రం ఇచ్చి తమ పక్షాన నిలబడాలని గొర్రెకుంట రైతులు కోరారు.
ల్యాండ్ పూలింగ్తో లాభం : పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
ల్యాండ్ పూలింగ్తో రైతులకు ల్యాండ్ అక్విజిషన్ కంటే లాభం జరుగుతుంది. మంత్రి కేటీఆర్ 'కుడా' మీటింగ్ పెట్టినప్పుడే మీకంటే నాకు ఎక్కువ అనుమానాలు వచ్చినరు.. గతంలో అవుటర్ రింగ్ రోడ్డు మంజూరైంది. మరియపురం-దామెర వరకు మంజూరైన ఈ రోడ్డు కింద భూములు కోల్పోయిన వారికి ల్యాండ్ అక్విజిషన్ కింద ఎకరాకు రూ.10-12 లక్షలు, గరిష్టంగా రూ.18 లక్షల కంటే నష్టపరిహారం రాలేదు. కానీ, ల్యాండ్ అక్విజిషన్ తరువాత రైతుల భూములు ఎకరాకు కనిష్టంగా 50 లక్షల నుంచి.. గరిష్టంగా రూ.కోటి మార్కెట్ విలువ పలుకుతోంది. ల్యాండ్ విలువ ఎక్కడా ఎకరాకు రూ.6 లక్షల కంటే ఎక్కువ లేదు. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇస్తే, ఆ భూములను 'కుడా' లే అవుట్ చేస్తే గజానికి రూ.10 వేలు ధర వస్తుంది. తద్వారా రైతులకు లాభం జరుగుతుంది.