Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంఎన్ నగర్ గుడిసె వాసులకు పట్టాలివ్వాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ-కాజీపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తూ పేద ప్రజలను రోడ్డు పాలు చేయడం సరైంది కాదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం హన్మకొండ జిల్లా కాజీపేట మండలం ఎంఎన్ నగర్లో ప్రభుత్వం కూల్చి వేసిన ఇండ్లను పరిశీలించిన తమ్మినేని ఆ గుడిసె వాసుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మడికొండ మెట్టుగుట్ట దేవస్థానం భూమిలో 15 ఏండ్ల నుంచి గుడిసెలు వేసుకొని ఉంటున్న సుమారు 400 కుటుంబాలకు చెందిన ఇండ్లతో పాటు వారే స్వయంగా ఏర్పాటుచేసుకున్న పాఠశాలనూ దేవాదాయ శాఖ కూల్చివేయడం దుర్మార్గమన్నారు. గుడిసెలేసుకున్న వారిలో దళితులు, వెనుకబడిన తరగతులు, ముస్లింలే ఎక్కువగా ఉన్నారని, వారికి నిలువనీడలేకుండా చేశారని విమర్శించారు. సీపీఐ(ఎం) అండతో గుడిసె వాసులు కూల్చువేతను అడ్డుకోగా తాత్కాలికంగా నిలిపివేయడం పోరాటంలో ఓ అడుగు ముందుకు పడిందనీ, దీన్ని ఇలాగే కొనసాగించి ఇండ్లను సాధించేవరకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమస్యపై ప్రభుత్వానికీ లేఖ రాస్తానని చెప్పారు. గతంలో దేవస్థానం భూమిని రైల్వేకి, అయోధ్యపురం గ్రామపంచాయతీ కోసం ప్రభుత్వం కొనుగోలు చేసి ఉపయోగించుకుంటుందని తెలిపారు. అలాగే, పేదలు ఇండ్లు ఏర్పాటుచేసుకున్న ఈ భూమినీ ప్రభుత్వమే కొనుగోలు చేసి వారికి అక్కడే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పేదలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ్మినేని వెంట ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, పాలడుగు భాస్కర్, జిల్లా కార్యదర్శి ఎం చుక్కయ్య, జిల్లా కమిటీ సభ్యులు బొట్ల చక్రపాణి, నాయకులు సంటి రవి, నరేందర్, రాజు, మోహన్, అన్వర్ రమేష్, దశరథ్ అరుణ్, లలిత, ఆబెధా బేగం, గీత, సీత, అరుణ, రమ తదితరులు ఉన్నారు.