Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రసంగించనున్న రాహుల్ గాంధీ
- 25 బాధిత రైతు కుటుంబాల పరామర్శ
- ఆసక్తికరంగా మారిన 'వరంగల్ డిక్లరేషన్'
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రైతుల సమస్యలను ఎజెండాగా చేసుకొని టీపీపీపీ హన్మకొండలో నేడు నిర్వహించనున్న రైతు సంఘర్షణ సభకు భారీ ఏర్పాట్లు చేసింది. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలోని 25 ఎకరాల మైదానంలో మూడు భారీ స్టేజీలను నిర్ధేశకులు ఏర్పాటు చేశారు. ఒక స్టేజీపై రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ నేతలు, మరో స్టేజీపై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబసభ్యులు, మూడో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న 25 రైతు కుటుంబాల సభ్యులను వేదిక మీదకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ వారితో ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ సభలో 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. సభ సక్సెస్ అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయమనే సెంటిమెంట్‌తో కాంగ్రెస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అమలు చేసే పథకాలను 'వరంగల్ డిక్లరేషన్' ద్వారా రాహుల్ ప్రకటించనున్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతుంది.
ఈనెల 6న సాయంత్రం 5.55 గంటలకు కాజీపేట సెయింట్ గాబ్రియేల్స్ హై స్కూల్ మైదానంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో హెలికాప్టర్లో రాహుల్ గాంధీ దిగనున్నారు. అనంతరం 6.05 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానానికి రానున్నారు. ముందుగా ఆత్మహత్య చేసుకున్న 25 మంది రైతు కుటుంబాలతో రాహుల్ ముచ్చటిస్తారు. అనంతరం భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించనున్నారు. రాత్రి 8.00 గంటలకు రాహుల్‌గాంధీ రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరతారు.
ఆసక్తికరంగా మారిన 'వరంగల్ డిక్లరేషన్'
రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ ప్రకటించే 'వరంగల్ డిక్లరేషన్' ఆసక్తికరంగా మారింది. గత కాంగ్రెస్ పాలనలో రైతులకు అమలు చేసిన పథకాలతోపాటు రుణమాఫీని దేశవ్యాప్తంగా ఏకకాలంలో అమలు చేసే పథకాన్ని ఈ 'వరంగల్ డిక్లరేషన్'లో రాహుల్‌గాంధీ ప్రకటించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1998లో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పరకాల, రేగొండ, శాయంపేట, హసన్‌పర్తి, రఘునాధపల్లిలలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించారు. 24 ఏండ్ల తర్వాత ఏఐసీసీ ఉపాధ్యక్షులు, ఎంపీ రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటనకు రానుండటం గమనార్హం.