Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్మిక చట్టాలు, హక్కులు, ఉపాధి కల్పనపై చర్చ
- నేటి నుంచి రోమ్‌లో డబ్ల్యూఎఫ్‌టీయూ 18వ కాంగ్రెస్
- కార్మిక చట్టాలు, హక్కులు, ఉపాధి కల్పనపై చర్చ
- ప్రపంచ కార్మిక పోరాటాలకు దిక్సూచిగా నిలవనున్న కాన్ఫరెన్స్
- సీఐటీయూ నుంచి హేమలత, అనాది సాహు, ఎంపీ ఎలమారం కరీం, స్వదేశ్దేవ్రారు హాజరు
- ఆన్లైన్లో పాల్గొననున్న ఎం.సాయిబాబు, ఇతర నేతలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టీయూ) ఆధ్వర్యంలో 18వ వరల్డ్ ట్రేడ్ యూనియన్స్ కాంగ్రెస్ శుక్రవారం ప్రారంభం కానుంది. ఇటలీ రాజధాని రోమ్ నగరం వేదికగా ఈనెల ఎనిమిదో తేదీ వరకు అది కొనసాగనున్నది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక పోరాటాలకు దిక్సూచిగా నిలుస్తున్న డబ్ల్యూఎఫ్‌టీయూ కాంగ్రెస్‌లో పాల్గొనేందుకు వీలుగా సీఐటీయూ నుంచి అఖిల భారత అధ్యక్షులు కె.హేమలత, కార్యదర్శి స్వదేశ్దేవరారు, కేరళ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ఎలమారం కరీం, పశ్చిమబెంగాల్ ప్రధాన కార్యదర్శి ఆనాది సాహు రోమ్కు బయలుదేరి వెళ్లనున్నారు. సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, కార్యదర్శి ఏఆర్ సింధు, జాతీయ నేతలు ఏవీ నాగేశ్వర్రావు, ఆర్.లక్ష్మయ్య, కరుమలయన్, కె.ఎన్.ఉమేశ్‌తోపాటు ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, బీఎస్ఎన్ఎల్, ట్రాన్స్‌పోర్టు రంగాలకు చెందిన నేతలు జూమ్ పద్ధతి ద్వారా సమావేశాల్లో పాలుపంచుకోనున్నారు.
డబ్ల్యూఎఫ్‌టీయూ... రెండో ప్రపంచ యుద్ధం అనంతరం 1945 అక్టోబర్ 3న ఏర్పడింది. పెట్టుబడిదారీ వ్యవస్థ చేసే దోపిడీకి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని సంఘటితం చేయడం, వారి జీవన పరిస్థితులను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా ఇది పురుడుపోసుకున్నది. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కార్మిక పోరాటాలకు సంఘీభావం తెలుపుతూ అందర్నీ ఏకం చేసి సోషలిజం వైపు అడుగు వేయడానికి వర్గపోరాటమే ప్రధాన ఆయుధమని నమ్మి ముందుకు సాగుతున్నది. వివిధ దేశాల్లో జరుగతున్న పోరాటాలను సమన్వయం చేసే బాధ్యతను తన భుజాన వేసుకున్నది. అనాగరికమైన పెట్టుబడిదారీ వ్యవస్థ రద్దు కోసం తన శక్తిమేర కృషి చేస్తున్నది. ఈ సంఘం 133 దేశాల్లో అనుబంధ, సారూప్య సంఘాలతో కలిసి పనిచేస్తున్నది. డబ్ల్యూఎఫ్టీయూలో 105 మిలియన్ల సభ్యులున్నారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రధాన అజెండా ఇదే...
- జీతాలు తగ్గించకుండా వారంలో 35 గంటల పని (వారంలో ఐదు రోజుల పని) కల్పించి, అదే సమయంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా కొంతమేర నిరుద్యోగ సమస్యను తగ్గించేందుకు పాలకవర్గాలపై ఒత్తిడి తీసుకురావాలి. ఇందుకోసం పోరాటాలు, కార్యాచరణ రూపకల్పన.
- పార్ట్‌టైమ్ వర్కు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో కాకుండా డిగ్నిపైడ్ వర్క్‌ను సిస్టమ్‌ను తీసుకొచ్చేందుకు కృషి.
- ప్రస్తుతం కార్మికుల సామాజిక భద్రతపై పాలకులు, యాజమాన్యాల నుంచి ముప్పేట దాడి జరుగుతున్నది. దీన్ని అడ్డుకుని కార్మికులకు దక్కాల్సిన కనీస సౌకర్యాల కోసం కొట్లాడేందుకు ప్రపంచవ్యాప్తంగా చేయాల్సిన పోరాటాల రూపకల్పన.
- ట్రేడ్ యూనియన్లను నిర్వీర్యం చేయడం, సమ్మె హక్కు మీద దాడి, దానికి కావాల్సిన చట్టాల మార్పులనేవి అంతర్జాతీయంగా కొనసాగుతున్న పరిణామాలు. ట్రేడ్ యూనియన్లకు ఉన్న కనీస బేరసారాల హక్కును కూడా హరించేస్తున్నారు. దీన్ని ఎలా అడ్డుకోవాలనే దానిపై చర్చ.
- ఐఎల్ఓ లెక్కల ప్రకారం ప్రమాదాలు, ఆయా రోగాలతో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 2.3 మిలియన్ల కార్మికులు చనిపోతున్నారు. అంటే ప్రతిరోజుకు సగటున ఆరు వేల మంది మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పని ప్రదేశంలో కార్మికుల భద్రత కల్పించాలనేది ముఖ్యమైన ఎజెండా.
- మల్టీనేషనల్ కంపెనీల యాజమాన్యాలు, గుత్తపెట్టుబడిదారులు టెక్నాలజీని ఉపయోగించుకుని (సీసీ కెమెరాలు, సర్వేలైన్స్, చెకింగ్లు, తదితరాలతో) పని ప్రదేశాల్లోనూ, నివాస స్థలాల్లోనూ కార్మికుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించేస్తున్నారు. నివాస ప్రాంతాల్లో స్వేచ్ఛాహక్కుల మీద దాడి జరుగుతున్నది. ఇలాంటి నిరంకుశత్వాలపై పోరాడేందుకు కార్యాచరణ రూపకల్పన.
- బాలకార్మికులతో పనిచేయించటాన్ని అడ్డుకుని వారికి విద్యనందించేలా పాలకవర్గాలతో కొట్లాడటం, గర్భిణీలకు ప్రసూతి సెలవులు ఇవ్వకపోవటంపైనా పోరాటాలు, కార్యాచరణ.
- పర్యావరణ సమతుల్యత దెబ్బతిని సామాన్యులు, పనిప్రదేశాల్లో కార్మికులు మరణిస్తున్న నేపథ్యంలో వారి కోసం ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలనే అజెండాపై చర్చ.
- ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఆధీనంలో ఉన్న నాటో, యూరోపియన్ యూనియన్లు చాలా దేశాల మీద ఆంక్షలు పెట్టడం వల్ల ఆయా దేశాల్లోని కార్మికులు, సామాన్యుల జీవవిధానంపై దాడి జరుగుతున్నది. అందువల్ల ఆ రెండింటినీ రద్దు చేయాలనే డిమాండ్.
- నయా ఉదారవాద విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పోరాటాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక దేశంలోని కంపెనీలో జరిగే పోరాటానికి వేరే దేశంలో అదే కంపెనీలో పనిచేసే కార్మికులు సంఘీభావం తెలపడం, వారు పోరాటాల్లోకి వచ్చేలా ప్రయత్నించటం.
ప్రయివేటీకరణను వ్యతిరేకించటం
- విద్య, వైద్యం, రవాణా, విద్యుత్ రంగాలను జాతీయం చేసి ప్రభుత్వ ఆధీనంలో ప్రజలకు సేవలు అందించేలా పోరాటాలు రూపొందించటం.
-ొ రంగు, జాతి, కులం, ప్రాంతం పేరుతో విద్వేషాలను రెచ్చగొట్టి వర్గ ఐక్యతకు గండికొడుతున్న పాలకవర్గాలపైనా, యాజమాన్యాలపైనా పోరాటాలకు కార్యాచరణ రూపొందించటం. వర్గ ఐక్యతను సాధించటం ముఖ్య లక్ష్యం.
సామాన్య కార్మికుల్లో చైతన్యానికి కృషి
దశాబ్దకాలంగా నిరుద్యోగం, పనిగంటల తగ్గింపు, కార్మికుల శ్రమ గుర్తింపు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులపై కొనసాగుతున్న దాడులను తిప్పికొట్టేందుకు వీలుగా డబ్ల్యూఎఫ్‌టీయూ ప్రపంచవ్యాప్తం గా దశ, దిశ, నిర్దేశం చేస్తున్నది. అందులో భాగస్వామిగా ఉన్న సీఐటీయూ సామాన్య కార్మికుల్లో సైతం చైతన్యాన్ని పెంచడం కోసం కృషి చేస్తున్నది. ఈ క్రమంలో డబ్యూఎఫ్టీయూ తీర్మానాలను అమలు చేయటంతోపాటు అంతర్జాతీయ కాంగ్రెస్ నిర్ణయాలను ముందుకు తీసుకుపోవడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాం. రైతు పోరాటాలకు సంఘీభావం తెలపటం ద్వారా కార్మిక, కర్షక ఐక్యత కోసం పాటుపడతాం.
- ఎం.సాయిబాబు, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షులు