Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 8.30 గంటలకే విద్యార్థులు కేంద్రాలకు చేరుకోవాలి
- నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
- ఇన్విజిలేటర్లు, డీవోలు మొబైల్ఫోన్లు వాడొద్దు
- 9,07,393 మంది విద్యార్థులు
- 1,443 పరీక్షా కేంద్రాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 24వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 4,64,626 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,42,767 మంది కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారు. వారికోసం 1,443 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండదు. అందువల్ల సకాలంలో చేరుకోవాలని విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 8.30 గంటలకల్లా పరీక్షా కేంద్రాల్లోకి రావాలని కోరుతున్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడం కోసం 25 వేల మంది ఇన్విజిలేటర్లను నియమించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ మీడియాతో మాట్లాడారు. ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ అధికారులు (డీవో) మొబైల్ఫోన్లు వాడేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లే అవకాశం లేనందున చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్) మాత్రమే ఫోన్లు వాడేందుకు అనుమతి ఉందన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో సీఎస్, డీవోల సమక్షంలో ప్రశ్నాపత్రాలు ఓపెన్ చేస్తారని వివరించారు. ఇంటర్ బోర్డు, జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ప్రశ్నాపత్రాల్లో తప్పులను గుర్తించేందుకు సంబంధించి సబ్జెక్టు నిపుణులు, అధ్యాపకులు అందుబాటులో ఉంటారని చెప్పారు. ఒకవేళ తప్పులను గుర్తిస్తే విద్యార్థులకు తెలియజేస్తామన్నారు. ప్రతిరోజూ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఇంటర్ బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూం 040-24600110 అందుబాటులో ఉంటుందని వివరించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు 8.30 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. ఎంసెట్, నీట్, జేఈఈ పరీక్షలకు సకాలంలో వెళ్లే విద్యార్థులు ఇంటర్ పరీక్షలకు హాజరు కావడానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఓఎంఆర్‌లో విద్యార్థుల వివరాలు ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకోవడానికి అవకాశముంటుందని చెప్పారు. తప్పులను గుర్తిస్తే విద్యార్థి, ఇన్విజిలేటర్ సంతకం చేయాలన్నారు. రాష్ట్రంలో 26 సెల్ఫ్ సెంటర్లున్నాయనీ, ఇందులో ఒక ఆర్మీ, రెండు అంధ విద్యార్థుల కాలేజీలున్నాయని వివరించారు. చిన్న బెంచీకి ఒకరు, మీటరు దూరంలో ఉంటే బెంచీ ఇద్దరు చొప్పున పరీక్షలు రాస్తారని చెప్పారు. రోజూ శానిటైజేషన్ చేయాలని ఆదేశించామనీ, కోవిడ్ నిబంధనలు పాటిస్తామని అన్నారు. విద్యార్థులు మాస్క్ ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పరీక్షల నిర్వహణ కోసం 75 మంది స్క్వాడ్లు, 150 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. విద్యుత్ సరఫరా ఉండాలనీ, అదనపు బస్సులు నడపాలనీ, ఏఎన్ఎం లేదా ఆశా వర్కర్ అందుబాటులో ఉండాలంటూ సంబంధిత అధికారులకు దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ నేతృత్వంలో హైపవర్ కమిటీ ఉంటుందనీ, పరీక్షల నిర్వహణ తీరును నిరంతరం పరిశీలిస్తుందని అన్నారు.
శ్రీచైతన్య, నారాయణ విద్యార్థులు ఆయా కాలేజీల్లో పరీక్ష రాయరు
శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు ఆయా కాలేజీల్లో పరీక్ష రాసేందుకు అవకాశం లేదని జలీల్ స్పష్టం చేశారు. ఆ కాలేజీలు ఒకే కోడ్‌తో ఉంటాయనీ, అందుకే విద్యార్థులు ఆ కాలేజీల్లో పరీక్షా కేంద్రం ఉండబోదని అన్నారు. జంబ్లింగ్ విధానంలో వేరే కాలేజీల్లో రాస్తారని వివరించారు. హైదరాబాద్‌లో చదివే కాలేజీ నుంచి ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో, గ్రామీణ ప్రాంతాల్లో ఐదు కిలోమీటర్ల పరిధిలో విద్యార్థులకు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రశ్నాపత్రంలో తప్పుల్లేకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్లో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు విద్యార్థులకు అవకాశం కల్పించామన్నారు. వాటిపై ఎవరి సంతకం అవసరం లేదన్నారు. ఇప్పటి వరకు 2,21,178 మంది విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని వివరించారు. ఫీజు కడితేనే హాల్‌టికెట్ ఇస్తామన్న కాలేజీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే అవినాష్ సహా మరో కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశామన్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడం కోసం తొమ్మిది క్లినికల్సైకాలజిస్టులను నియమించామని చెప్పారు. ప్రతిరోజూ 200 నుంచి 300 మంది విద్యార్థులు ఫోన్ చేసి అనుమానాలు, ఒత్తిడికి సంబంధించిన వివరాలు అడిగి నివృత్తి చేసుకుంటున్నారని అన్నారు.
14 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్
ప్రస్తుత విద్యాసంవత్సరంలో 14 కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ఈనెల ఎనిమిదో తేదీ నుంచి ప్రారంభమవుతుందని జలీల్ చెప్పారు. ఈ ఏడాది మంచిర్యాల, నిర్మల్‌లో కొత్తగా ప్రారంభిస్తున్నామని అన్నారు. సంస్కృతం సబ్జెక్టు జవాబు పత్రాలను తొలుత మూల్యాంకనం చేస్తారని వివరిచంఆరు. ఈనెల 24న ఇంటర్ పరీక్షలు ముగుస్తాయనీ, నెలరోజులపాటు మూల్యాంకనం జరుగుతుందని చెప్పారు. జూన్ 24వ తేదీ నాటికి ఇంటర్ ఫలితాలు విడుదల చేయాలని భావిస్తున్నామని అన్నారు. వచ్చే విద్యాసంవత్సరం (2022-23) జూన్ ఒకటో తేదీ నుంచి ప్రారంభం కావాలన్నారు. అయితే కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుత విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఆలస్యంగా పరీక్షలు జరగడం వల్ల వారం, పది రోజుల ఆలస్యంగానే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు.
ఇంటర్ విద్యార్థుల వివరాలు విద్యార్థులు ప్రథమ ద్వితీయ మొత్తం
అబ్బాయిలు 2,31,546 2,23,503 4,55,049
అమ్మాయిలు 2,33,080 2,19,264 4,52,344
మొత్తం 4,64626 4,42,767 9,07,393