Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2004 నాటి స్వర్ణపాలన అందిస్తాం
- జనం వాయిస్ దృశ్య కావ్యం ఆవిష్కరణలో రేవంత్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2004 నాటి స్వర్ణమయ పాలనను అందిస్తామని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి చెప్పారు. రైతులకు మళ్ళీ అన్నిరకాల సబ్సిడీలు అందిస్తామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు ఏం చేయబోతున్నామో రైతు సంఘర్షణ సభలో చెప్పనున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్్లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, నేతలను జె గీతారెడ్డి, మధుయాష్కీగౌడ్, ఓబీసీ జాతీయ నేత కత్తి వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలిసి ప్రజాగాయకుడు గద్దర్ రూపొందించిన 'జనం వాయిస్ దృశ్య కావ్యం'ను ఆయన ఆవిష్కరణ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, సోనియమ్మ రాజ్యంలో అభివృద్ధి చేసి చూపుతామని చెప్పారు. పీవీ నరసింహారావు, మన్మోహన్సింగ్ లాంటి గొప్ప నాయకులను దేశానికి అందించిన చరిత్ర కాంగ్రెస్‌కు ఉందన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు రైతులను మోసం చేస్తున్నాయని విమర్శించారు. వడ్లు కొనుగోలు చేయాలంటూ రైతులు అడుగుతుంటే, ఆ రెండు పార్టీలు ధర్నాల పేరుతో నాటకాలాడుతున్నాయని చెప్పారు. రైతు సమస్యల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకు రాహుల్‌గాంధీ రాష్ట్రానికి వస్తున్నారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై కాంగ్రెస్ చేయబోతున్న యుద్ధానికి రైతులు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిబూత్ మెంబర్షిప్ ఎన్రోలర్తోపాటు సభకు తొమ్మిది మందిని తీసుకురావాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ అవినీతికి అవధులు లేవనీ, యాదగిరి గుట్టలో నరసింహస్వామి దేవాలయ నిర్మాణంలో కూడా అవినీతి జరిగిందన్నారు. రెండువేల కోట్లతో నిర్మించిన దేవాలయంలో కూడా కేసీఆర్ కుటుంబ అవినీతి దాగివుందని ఆరోపించారు. ఆ దేవుడు కూడా ఆ కుటుంబానికి బలైపోయారని ఎద్దేవా చేశారు. అమరవీరుల స్థూపంలో కూడా అవినీతి జరిగిందనీ, రూ 62 కోట్లతో మొదలు పెట్టిన స్థూపం రెండువందల కోట్లు చెల్లించినా పూర్తి కాలేదన్నారు. కేసీఆర్ కుటుంబ ఆస్తులు నిజాం ప్రభువుల సంపదను మించిపోయిందని ఆయన చెప్పారు.
పోలీసు పహారాలేనిదే తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది : హరీష్‌రావుకు రేవంత్ ట్వీట్
పోలీసుల పహారాలేనిదే నువ్వు, నీ మామ తెలంగాణలో తిరగలేని పరిస్థితి ఎందుకొచ్చింది హరీష్!? అంటూ టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. 'నీ పర్యటన నేపథ్యంలో పొలాలకు వెళ్లి పోలీసులు రైతులను ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పు. ప్రజాసేవలో కాంగ్రెస్ త్యాగాలు నీలాంటి అల్పులకు అర్థం కావు. రాహుల్‌ను విమర్శించే స్థాయీ, అర్హత నీకు లేవు' అని పేర్కొన్నారు.