Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీది అంతులేని వైఫల్యాల చరిత్రను చెప్పలేను
- రైతన్నల మరణమృందం గురించి చెప్పండి
- యూపీఏ పదేండ్ల పాలనతో తెలంగాణకు ఏం చేశారు?
- యూపీ రాహుల్‌గాంధీకి మంత్రి నిరంజన్‌రెడ్డి బహిరంగ లేఖ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దశాబ్దాల నాటి కాంగ్రెస్ పాలనే వ్యవసాయ రంగ దుస్థితికి కారణమనీ, ఆపార్టీది అంతులేని వైఫల్యాల చరిత్రనీ, దాన్ని ఒక లేఖలో చెప్పలేనంటూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతన్నల మరణమృందం దేశంలో పెద్ద విషాదమని గుర్తు చేశారు. పదేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రాంతానికి ఏం చేశారో చెప్పాలంటూ ఏఐసీసీ జాతీయ నేత రాహుల్‌గాంధీని కోరారు. ఈమేరకు గురువారం రాహుల్‌గాంధీకి ఆయన బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ పాలనలో ఎన్సీఆర్బీ లెక్కల ప్రకారం 1,58,117 రైతులు అప్పులపాలై, ఆత్మహత్యలు చేసుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు పదేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగానికి ఒరిగింది శూన్యమేనని తెలిపారు. కరెంట్ కోతలు, కరెంట్ షాక్‌తో, పాములు కాటుకు గురై వేలాది మంది రైతులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజొన్న రైతులు తమకు బకాయిలు చెల్లించాలని కోరితే, వారిని కాల్చి చంపిన కర్కశ పాలన కాంగ్రెస్‌ది కాదా? నాడు రైతులపై తుపాకి తూటాలు పేల్చిన మీరు ఇప్పుడు రైతుసభలు పెడ్తరా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ భూములు పంచాలనీ, పేదలకు ఇంటి జాగాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన ముదిగొండ పేదలపై కాల్పులు జరిపి ఏడుగురి ప్రాణాలు బలిగొన్నది కాంగ్రెస్‌కు కాదా? బుల్లెట్లు కురిపించి రైతులను పొట్టన పెట్టుకున్న పాపానికి, ముందు క్షమాపణలు చెప్పాలని రాహుల్‌ను డిమాండ్ చేశారు. రైతాంగాన్ని కన్నీరు పెట్టించిన కాంగ్రెస్ పార్టీని అన్నదాతలు ఎన్నటికీ క్షమించరనీ, వరిధాన్యం కొనుగోలుపై మోడీ సర్కారు మోసానికి వ్యతిరేకంగా తెలంగాణ రైతు ఆందోళనకు దిగినప్పుడు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
వ్యవసాయం, రైతుల కష్టాలపై మీకున్న అవగాహన ఏంటి? వ్యవసాయం మీరు గురించి మాట్లాడటమంటే, అదొక వింత కాదా? అని పేర్కొన్నారు. నాలుగువేల మెగావాట్ల యాదాద్రి థర్మల్‌పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆపాలంటూ స్థానిక కాంగ్రెస్ నాయకులు కేంద్రానికి లేఖలు మీకు రాసిన విషయం తెలియదా? అది రైతులకు ద్రోహం చేయడం కాదా? అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో అత్యధిక కాలం అటు కేంద్రంలోనూ, దశాబ్దాలపాటు ఇటు రాష్ట్రాల్లోనూ అధికారం చలాయించిన కాంగ్రెస్ పార్టీ...ఆ తర్వాత వచ్చిన బీజేపీ అసమర్థ విధానాల వల్లనే దేశం ఈ దుస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులలో రైతు సంఘర్షణ సభ పేరుతో తెలంగాణలో రాజకీయం చేసేందుకు వస్తున్న రాహుల్ గాంధీ స్వయంగా ఈ అంశాలపై తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని తన లేఖలో డిమాండ్ చేశారు.