Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిడుగుపాటుతో మరణించిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి: ఎమ్మెల్సీ నర్సిరెడ్డి డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బుధవారం తెల్లవారు జామున కురిసిన అకాల వర్షంతోపాటు గాలివాన రావడంతో వరిపంటకు తీవ్ర నష్టం జరిగిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వాటివల్ల పంటనష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కల్లాలు, మార్కెట్లు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దయ్యిందని తెలిపారు. కొన్నిచోట్ల చేతికందకుండా కొట్టుకుపోయిందని వివరించారు. పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మరణించారనీ, వారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పశువులు, గొర్రెలు, మేకలు మృత్యువాతపడ్డాయని పేర్కొన్నారు. మామిడి, నిమ్మ, బత్తాయి, కూరగాయ తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు కూలిపోయాయని వివరించారు. హైదరాబాద్లో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని తెలిపారు. ప్రభుత్వం వెంటనే రైతులకు జరిగిన పంట, వరిధాన్యం నష్టాన్ని లెక్కించి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కల్లాల్లో ఉన్న తడిసిన వరి ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. రైతులు పండించిన వరిధాన్యం మార్కెట్లు, ఐకేపీ కేంద్రాలు, కళ్లాలు, రోడ్ల వెంబడి కుప్పలు పోసి కాపలా కాస్తున్నారని వివరించారు. సకాలంలో కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులు అకాల వర్షానికి నష్టపోయారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, బస్తాలు ఏర్పాటు చేయాలని కోరారు. యుద్ధప్రాతిపదికన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యానికి బాధ్యతగా మద్దతు ధర కల్పించాలని కోరారు. పశువులు, గొర్రెలు, మేకలు, పంటలు, కూరగాయలు, పండ్లతోటలు నష్టపోయిన వారికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. హైదదాబాద్తోపాటు లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.