Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని డిమాండ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బుధవారం ఉదయం పడిన అకాల వర్షాల వల్ల 30 వేల క్వింటాళ్ల ధాన్యం, నువ్వులు, మామిడి, మొక్కజొన్న పంటలు బాగా దెబ్బతిన్నాయని గురువారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. పిడుగులు పడి ఇద్దరు మరణించారని తెలిపారు. గొర్రెలు చనిపోయాయని పేర్కొన్నారు. ఈ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం సేకరించి నష్టపోయిన వారిని తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు రైతులు మార్కెట్ యార్డులకు తెచ్చిన వడ్లు తడవడంతోపాటు, చాలా ప్రాంతాల్లో వరదల్లో కొట్టుకుపోయాయని వివరించారు. నిలువుపై ఉన్న పంటలూ తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు.
ఈ ఏడాది పడిన వడగండ్ల వర్షాలతో జరిగిన నష్టాన్ని వరంగల్‌కు వెళ్లి మంత్రులు పర్యటించినప్పటికీ ఇంతవరకు రైతులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదని విమర్శించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం ఎప్పుడు జరిగినా ప్రభుత్వం స్పందించడం లేదని పేర్కొన్నారు. ఈ ఏడాది మూడుసార్లు కురిసిన అకాల, అధిక వర్షాల వల్ల దాదాపు 8.50 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వివరించారు. 15వ ఆర్థికసంఘం కేటాయించిన రూ.600 కోట్ల నిధులూ పంపిణీ కాలేదని తెలిపారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేశారు. 6,812 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి కేవలం 3,525 కేంద్రాలను మాత్రమే తెరిచి 4.21 లక్షల టన్నుల వడ్లు మాత్రమే కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. తగినన్ని కేంద్రాలు తెరిచి మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు ఇంత నష్టం వాటిల్లేది కాదని తెలిపారు. పంటలకు జరిగిన నష్టం గణాంకాలను ప్రభుత్వం వెంటనే సేకరించి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పూర్తిస్థాయిలో తెరిచి మార్కెట్‌కు వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు.