Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయికి ఆరోగ్యశ్రీ సేవలను విస్తరించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. ఇందుకనుగుణంగా అక్కడి వైద్య సిబ్బందికి అవసరమైన శిక్షణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావును మంత్రి ఆదేశించారు. పీహెచ్సీల పనితీరుపై గురువారం మంత్రి హరీశ్ రావు జిల్లాల డీఎంహెచ్వోలతో సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ మంజూరైన బస్తీ దవాఖానాలను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాధారణ ప్రసవాలు పెంచాలనే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వ వైద్యులకు, నర్సులకు ప్రోత్సాహకాలు ఇవ్వబోతున్నట్టు చెప్పారు.
సి సెక్షన్లు తగ్గించేందుకు అయ్యగార్లతో సమావేశం....
సిజేరియన్ ఆపరేషన్లకు ముహూర్దాలు పెట్టకుండా అయ్యగార్లు, పండితులను కోరుతామని హరీశ్ ఈ సందర్భంగా చెప్పారు. ఇందుకోసం కలెక్టర్ల సమక్షంలో వారితో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని డీఎంహెచ్ వోలను ఆదేశించారు. సి సెక్షన్లు తగ్గించడంలో ప్రభుత్వ, ప్రయివేటు గైనకాలజిస్టులను భాగస్వాములను చేయాలని ఆదేశించారు. డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించాలని కోరారు. రోగాలను ముందే గుర్తించడంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పాత్ర కీలకమనీ, అవి సక్రమంగా పని చేస్తే రోగాలు రాకుండా ప్రజలను కాపాడవచ్చన్నారు.