Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
శుక్రవారం నుంచి ఇంటర్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థినీ, విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు ప్రకటించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలనీ, కష్టపడి చదివిన వారు ఇష్టంతో రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని గురువారం ఒక ప్రకటనలో మంత్రి ఆకాంక్షించారు. విద్యార్థులెవరూ భయానికి, ఆందోళనకు గురికావొద్దని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో 70 సిలబస్‌తోనే పరీక్షలు నిర్వహిస్తున్నామనీ, ప్రశ్నల చాయిస్ పెంచామని గుర్తు చేశారు. ప్రత్యేక గుర్తింపు పొందడాకి ఈ పరీక్షలను నాందిగా, భవిష్యత్తుకు ఒక పునాదిగా భావించాలని కోరారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ప్రణాళిక వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులెవరైనా మానసిక ఒత్తిడికి గురైతే ఇంటర్ బోర్డు టోల్‌ఫ్రీ నెంబర్ 1800 5999 333 నెంబర్‌ను సంప్రదించాలని కోరారు.