Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటివరకు 4.61 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ : సీఎస్ సోమేశ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకు 4.61 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని, 61300 మంది రైతుల నుంచి 3679 కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేశామని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు, కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో పౌరసరఫరాలు, మార్కెటింగ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, మార్కెటింగ్ శాఖ అధికారులు భాస్కర్, అరుణ్, రుక్మిణి, పద్మజ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 7.80 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయనీ, మరో 8కోట్ల సంచుల కొనుగోలు టెండర్ల ప్రక్రియ శుక్రవారం పూర్తవుతుందన్నారు. మరో రెండున్నర కోట్ల గోనె సంచులను జ్యుట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి త్వరలోనే అందుతాయన్నారు. రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాలనుంచి అక్రమంగా ధాన్యం రాకుండా ఉండేందుకుగానూ 17 జిల్లాల సరిహద్దుల్లో 51 చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని వివరించారు.