Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు
- ములుగులో క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం
నవతెలంగాణ-ములుగు
వ్యవసాయ రంగంలో రైతులకు ఆదాయం పెరిగే విధంగా ఆలోచన చేయాలనీ, చైనా, ఇజ్రాయిల్ దేశాల్లో అవలంబిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని ఆచార్య కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో గురువారం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన 'వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన విధానాల'పై క్యాబినెట్ సబ్ కమిటీ రెండవ సమావేశం నిర్వహిచారు. అంతకుముందు ఏర్పాటు చేసిన సెంట్రల్ ఫర్ ఎక్సలెన్స్‌ను మంత్రుల బృందం సందర్శించింది. ఉద్యానవనంలో మంత్రి కేటీఆర్ విద్యుత్ వాహనం నడుపుతూ మామిడి చెట్లను పరిశీలించారు. అనంతరం సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల ఆలోచనా విధానం మారాలన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అన్నది ఒక్క చైనాలోనే సాధ్యమైందని తెలిపారు. 2022 వరకు మోడీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి విఫలమయ్యారన్నారు. దేశంలో దాదాపు 65 శాతం జనాభా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల మీదే ఆధారపడి ఉన్నారనీ, దేశ జీడీపీలో వారి వాటా మాత్రం 15 శాతం కూడా దాటడం లేదని తెలిపారు. 1987లో చైనా-ఇండియా జీడీపీ సమానం కాగా, అనంతరం 35 ఏండ్లలో చైనా 16 ట్రిలియన్ డాలర్లకు, ఇండియా 3 ట్రిలియన్ డాలర్ల వద్ద ఉందన్నారు. తెలంగాణలో వరిమళ్లలో చేపలను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నందున ఈ దిశగా ప్రయత్నించాలని చెప్పారు. వ్యవసాయానికి ఆధునికతను జోడిస్తే యువత ఈ దిశగా మళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో బ్లూ, పింక్, వైట్, ఎల్లో, గ్రీన్ విప్లవాలు విజయవంతమయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. 32 జిల్లాల్లో ప్రతి చోటా 25 ఎకరాల్లో రైతు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి, ఏడాదికి రెండుసార్లు 10 రోజుల పాటు వ్యవసాయ ప్రగతిపై రోజుకో కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ఫసల్‌బీమాకు ప్రత్యామ్నాయంగా పంటలు యూనిట్‌గా బీమా కంపెనీలతో మాట్లాడి శాస్త్రీయంగా కొత్త విధానం తీసుకురావాలన్నారు. మంత్రి పువ్వాడ అజరు మాట్లాడుతూ.. రైతుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఏడాది మిరపలో తామర పురుగు, గతేడాది పత్తిలో గులాబీ పురుగు ఆశించి రైతులను దెబ్బతీశాయని తెలిపారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మెన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హన్మంతరావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు, వీసీలు ప్రవీణ్‌రావు, నీరజ ప్రభాకర్, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్ రామ్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, సీడ్స్ ఎండీ కేశవులు, ఆగ్రోస్ ఎండీ రాములు తదితరులు పాల్గొన్నారు.