Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెల్లెలి ప్రేమ వివాహం నచ్చకనే..:
- వివరాలు వెల్లడించిన ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్
నవతెలంగాణ-హయత్‌నగర్
హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌లో బుధవారం జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ తెలపిఆరు. గురువారం ఆయన ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, అబ్దుల్లా పూర్మెట్ ఇన్స్పెక్టర్ స్వామితో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించారు.
రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా బాల్య స్నేహితులు. ఏడేండ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఆశ్రిన్ కుటుంబ సభ్యులకు తెలిసి నాగరాజును హెచ్చరించారు. నాగరాజు హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్దినెలల కిందట సేల్స్‌మన్‌గా ఉద్యోగంలో చేరాడు. జనవరి ఒకటో తేదీన న్యూ ఇయర్ సందర్భంగా ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు కొద్దిరోజుల్లో పెండ్లి చేసుకుందామని చెప్పాడు. అంగీకరించిన ఆశ్రిన్ జనవరి చివరి వారంలో నాగరాజు కోసం హైదరాబాద్‌కు వచ్చింది. లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న పెండ్లి చేసుకున్నారు. అనంతరం నాగరాజు వేరే ఉద్యోగంలో చేరాడు. వీరు హైదరాబాద్‌లో ఉంటున్నట్టు ఆశ్రిన్ కుటుంబ సభ్యులు తెలసుకోవడంతో రెండు నెలల కిందట విశాఖపట్నం వెళ్లి అక్కడే ఉన్నారు. ఎవరూ తమను వెంటాడటం లేదని భావించి.. ఐదు రోజుల కిందట మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి, సరూర్‌నగర్‌లోని పంజా అనిల్‌కుమార్ కాలనీలో నివసిస్తున్నారు. వీరి కదలికలను గుర్తించిన ఆశ్రిన్ కుటుంబ సభ్యులు మాటువేశారు. బుధవారం రాత్రి నాగరాజు, ఆశ్రిన్ కాలనీలోంచి బయటకు రాగానే ఆశ్రిన్ సోదరుడు మోబిన్ అహ్మద్, తన స్నేహితుడు, బంధువు అయిన మసూద్ అహ్మద్‌తో కలిసి బైక్‌పై వారిని వెంబడించారు. నాగరాజుపై ఇనుపరాడ్లు, కత్తులతో దాడి చేసి హత్య చేశారు. కేసు సున్నితత్వం దృష్ట్యా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని డీసీపీ స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రేమ పెండ్లి నచ్చకపోవడంతో బాధితురాలి సోదరుడు కక్షపూరితంగా చేసిన హత్య అని, ఎవరూ రూమర్లను నమ్మొద్దని, శాంతి భద్రతలకు విఘాతం కల్పించొద్దని కోరారు.