Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారంపల్లి మల్లారెడ్డి, టి. సాగర్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను లెక్కించి, వాటికి నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసింది. మార్కెట్ యార్డ్‌కు తెచ్చిన వడ్లు వానకు తడిసిపోవడంతో రైతులు నష్టపోయారనీ, మిరప, ఇతర పంటలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఈనేపథ్యంలో పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్‌తో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. ఇటీవల కురిసిన వానలకు 30వేల క్వింటాళ్ళ వడ్లు తడిసిపోయాయనీ, నీటిలో కొట్టుకపోయాయని చెప్పారు. కోతకు వచ్చిన వరి, నువ్వులు, మామిడి, మిరప, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్‌లో ఒకరు, జగిత్యాలలో మరొకరు పిడుగు పాటుకు గురై మరణించారనీ, 47 మేకలు మృత్యువాతపడ్డాయని చెప్పారు. అరబోసిన మిరప, కందులు, మొక్కజొన్నలు కూడ దెబ్బతిన్నాయన్నారు. ఈ పంటలను సివిల్సప్లరు శాఖ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయాలంటూ ప్రోత్సహించిన ప్రభుత్వం...ఆ పంటలను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం మాత్రం ముఖం చాటేస్తున్నదని చెప్పారు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రయివేటు వ్యాపారులు రైతులను లూఠీ చేస్తున్నారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాలల్లో జరుగుతున్న అక్రమాలకు అరికట్టాలనీ, రైతులను ఆదుకోవాలని కోరారు. క్వింటాల్ ధాన్యానికి కొన్ని చోట్ల రూ.30, మరికొన్ని చోట్ల రూ.52, హమాలీ కూలీ కింద రైతుల నుంచి వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. తేమపేరుతో క్వింటాలుకు 5 కిలోల వరకు కోత పెడుతున్నారని చెప్పారు. తూకం వేయడంలోనూ లోపాలు జరుగుతున్నాయని తెలిపారు. కొనుగోలు కేంద్రాలవల్ల దళారులు, మిల్లర్లు అవినీతికి పాల్పడకుండా విజిలెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. మార్కెట్ యార్డుల చుట్టు ఆయా బృందాలు నిరంతరం పరిశీలించాలని కోరారు. అవకతవకలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.