Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థికభారంగా డెలివరీలు
- రూ.లక్షకు పైగా డిమాండ్ చేస్తున్న వైనం
- కరోనాతో పెరిగిన సీ- సెక్షన్ ప్రసవాలు
- ప్రయివేటు గైనకాలజిస్టులతో కలెక్టర్ సమావేశం
- 'కడుపు కోస్తే' చర్యలు తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
ప్రసవ వేదనను మించిన ఆర్థిక భారంతో పేదలు ప్రయివేటు ఆస్పత్రుల్లో డెలివరీ చేయించుకోలేని పరిస్థితి ఏర్పడింది. రోజుకు పది వరకైనా 'కడుపులు కోసి' ఆర్థికంగా కూడబెట్టుకోవాలనే తాపత్రయం కొన్ని ఆస్పత్రులదైతే.. మరికొన్ని ఆస్పత్రులు సాధారణ ప్రసవాల పేరుతో దండుకుంటున్నాయి. సాధారణ ప్రసవాలకు గరిష్టంగా రూ.10వేల లోపు తీసుకోవాల్సి ఉండగా ఖమ్మంలో ఆంగ్ల 'నమ్మకం' పేరుతో నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రి నిలువు దోపిడీకి పాల్పడుతోంది. ఎటువంటి బిల్లులు ఇవ్వకుండా సాధారణ ప్రసవానికి రూ.లక్ష, ఆపైన గుంజుతోందని సమాచారం. సీ- సెక్షన్ డెలివరీ అయినా ఇక్కడ ఖమ్మంలోనే అత్యధికంగా రాబడుతున్నారని బాధితులంటున్నారు. ఈ ఆస్పత్రి తీరు ఇలా ఉంటే కొన్ని ఆస్పత్రులు సాధారణ ప్రసవం కోసం వేచి చూడకుండా 'మంచి తరుణం మించినా దొరకదు' అనే రీతిలో కొందరు ప్రయివేటు డాక్టర్లు వెంటనే కడుపు కోసి పిల్లలను బయటకు తీస్తున్నారు. ఆపరేషన్ పేరుతో రోజుల తరబడి పేషెంట్లను ఆస్పత్రిలో ఉంచి రూమ్, బెడ్స్, నర్స్, క్లీనింగ్, మెడికల్ చార్జీల పేరుతో రూ.30వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.
కరోనా నుంచి పెరిగిన సిజేరియన్లు..
కరోనా మహమ్మారి వ్యాప్తి దగ్గర నుంచీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిజేరియన్ డెలివరీలు పెరిగిపోయాయి. ముఖ్యంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో రోజుకు పది ప్రసవాలైతే ఒకటి, రెండు మాత్రమే సాధారణ ప్రవాలుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 2020-21లో 62.36% ఉన్న సిజేరియన్ కాన్పులు 2021-22 ప్రథమార్థంలో 79.14%కు చేరాయి. ఇక ప్రయివేటు ఆస్పత్రుల్లోనైతే 90% సిజేరియన్లే అవుతున్నాయి. కేసీఆర్ కిట్ కారణంగా ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే గర్భిణుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు మగ శిశువైతే రూ.12వేలు, ఆడ శిశువైతే రూ.13వేల చొప్పున ప్రభుత్వం ఇస్తోంది. ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఒత్తిడితో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,530 సాధారణ ప్రసవాలు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోగా ఫిబ్రవరిలో 1,120 (72.30%), మార్చిలో 1,412 (92.29%) చొప్పున చేశారు. కానీ ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని ప్రయివేటు ఆస్పత్రుల్లో దీనికి భిన్నమైన పరిస్థితులు ఉండటంపై కలెక్టర్లు దృష్టి సారించారు.
ప్రయివేటులో సిజేరియన్లపై కలెక్టర్ ఆగ్రహం
ధనార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా సిజేరియన్ కాన్పులు చేస్తున్న ప్రయివేటు ఆస్పత్రుల గైనకాలజిస్టులపై ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలరోజుల్లో రెండు సార్లు వారితో కలెక్టర్ సమావేశమయ్యారు. సీ సెక్షన్ డెలివరీలు చేస్తే ఇకపై ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇకమీద కమ్యూనిటీ ఆడిట్ చేస్తామని, సాధారణ ప్రసవాలకు అవకాశం ఉన్నా సిజేరియన్ కాన్పులు చేసినట్టు గుర్తిస్తే సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌వో మాలతిని ఆదేశించారు.
ఫీజుల సంగతేంటి కలెక్టర్ గారూ...
అధిక ఫీజులే ధ్యేయంగా కొన్ని ప్రయివేటు ఆస్పత్రులు సాధారణ ప్రసవానికి అవకాశం ఉన్నా సిజేరియన్ కాన్పులు చేస్తున్నట్టు సమాచారం. సాధారణ ప్రసవానికి రూ.10వేల లోపు ఫీజు తీసుకోవాల్సి ఉండగా రూ.30వేల వరకూ లాగుతున్నట్టు బాధితులు చెబుతున్నారు. సిజేరియన్లకు పేషెంట్ ఆర్థిక, ఆస్పత్రి స్థాయిని బట్టి రూ.30వేలు మొదలు రూ.లక్ష వరకు దండుకుంటున్నారని బాధితులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. నెలవారీ చెకప్ సమయంలోనూ కొన్ని ఆస్పత్రులు రూ.6వేలు మెడిసిన్, రూ.4వేలు టెస్టులకు ఖర్చు పెట్టిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రజాకోణంలో ఆలోచించే అతికొద్ది ఆస్పత్రుల్లో మాత్రమే న్యాయబద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెబుతున్నారు.
కరోనా నుంచి సీ సెక్షన్ డెలివరీలు పెరిగాయి
- డాక్టర్ యలమంచిలి రమాదేవి, గైనకాలజిస్టు, యలమంచిలి పాలిక్లీనిక్
కరోనా సమయం నుంచి సీ సెక్షన్ డెలివరీలు పెరిగాయన్న మాట యదార్థం. దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ ఆమేరకు దృష్టి సారించడం సంతోషం. ఇటీవల గైనకాలజిస్టులతో సమావేశాలు నిర్వహించారు. అవసరమైతే తప్ప మా క్లీనిక్‌లో సిజేరియన్ డెలివరీలు చేయట్లేదు. బెడ్ రెస్ట్ పేరుతో గర్భిణులు కదలకుండా ఉండటం, శరీరానికి కొద్దిపాటి వ్యాయామం కూడా లేకపోవడం వల్ల ఆపరేషన్లు పెరుగుతున్నాయి. అంగన్వాడీలు, ఆశాలు, పీహెచ్సీ వైద్యులు ఈ మేరకు గ్రామీణ ప్రాంతాల్లో అవేర్నెస్ తీసుకురావాలి.