Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కొక్క రైతుకు రూ.15,000 నష్టం
- ఉరుములు, మెరుపులతో ఆందోళనలో అన్నదాతలు
నవ తెలంగాణ - బోనకల్
ఎన్నో ఆశలతో ఉన్న అన్నదాతలు వారం రోజులుగా తీవ్ర నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఒక వైపు నాలుగు రోజులుగా ఉరుములు, మెరుపులతో పంట ఏమవుతుందా అన్న ఆందోళన ఉండగా, మరో వైపు వారం రోజుల వ్యవధిలో వ్యాపారులు ధర తగ్గించడంతో మరింతగా రైతులు ఆవేదనకు గురవుతున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్ మండలం యాసంగిలో 14,908 ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగు చేశారు. సాగు చేసిన నాటి నుంచి సాగర్ నీరు సక్రమంగా రాక అన్నదాతలను కొంత నష్టాల్లోకి నెట్టింది. వారబందీ పద్ధతిలో వచ్చిన సాగర్ నీటిని అనేక కష్టాలు పడి వినియోగించుకొని పంటలు పండించారు. ఎకరాకి రూ.30 వేల పెట్టుబడి కాగా, 14,908 ఎకరాలకు సుమారు రూ. 44.72 కోట్లు అన్నదాతలు మొక్కజొన్న పంటపై పెట్టుబడి పెట్టారు. 4.47 లక్షల క్వింటాళ్ల మొక్కజొన్న పంట దిగుబడి వచ్చింది.
15 రోజులుగా మొక్కజొన్న పంట అమ్మకాలు ప్రారంభమయ్యాయి. వారం రోజుల కిందట వరకు క్వింటా ధర రూ.2400 లకు ప్రయివేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. దాంతో రైతుల్లో ఆనందం వ్యక్తమయింది. కానీ వారం రోజుల నుంచి ధర రూ.1900లకు పడిపోయింది. దాంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎకరానికి 30 కింటాలు దిగుబడి వచ్చిన రైతులు రూ.2400 ప్రకారం రూ.72 వేల ఆదాయం వచ్చింది. వారం రోజుల నుంచి రూ.1900 ప్రకారం అన్నదాతలకు ఆదాయం 30 క్వింటాళ్లకు రూ.57 వేలు మాత్రమే వచ్చింది. ఈ ధర ప్రకారం ఒక్కొక్క రైతు ఎకరానికి రూ.15,000 నష్టం వాటిల్లింది. 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగుచేసిన రైతుకు రూ.75 వేలు నష్టం వచ్చింది. ఇలా మండల వ్యాప్తంగా సుమారు రూ. 22.36 కోట్లు నష్టం వాటిల్లింది.
నాలుగు రోజులుగా ప్రతిరోజూ ఉరుములు, మెరుపులు.. రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కల్లంలో ఉన్న పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ప్రభుత్వం మొక్కజొన్న పంటను కొనుగోలు చేయకపోవడంతో గ్రామాల్లో ప్రయివేటు వ్యాపారుల హవా నడుస్తుంది. ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తే తాము నష్టపోయే వాళ్ళం కాదని అన్నదాతలు అంటున్నారు.
4 ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా : ఇమ్మడి సైదులు, రైతు చిరునోముల
నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. దానికి రూ.1.30 లక్షలు పెట్టుబడి పెట్టాను. వారం రోజుల కిందట వరకు పంట ధర రూ.2400ఉండగా ఇప్పుడు రూ.1900 కొనుగోలు చేస్తున్నారు. కేవలం వారం రోజుల్లోనే నాలుగు ఎకరాలకు రూ.60 వేలు నష్టపోయాను. మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో గ్రామాల్లో ప్రయివేటు వ్యాపారులు ఎంతకడిగితే అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.