Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలకు కనీస మద్దతు ధర..హామీ నెరవేర్చాం
- ఛత్తీస్గడ్ వెళ్లి చూడండి : వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రూ.రెండు లక్షల రుణమాఫీ, పంటలకు కనీస మద్ధతు ధరలు ఇస్తామనిఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. వరంగల్‌లో జరిగిన రైతు సంఘర్షణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వంలోకి వచ్చాక నెరవేరుస్తుందని తెలిపారు. ఛత్తీస్‌గడ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీలు నెరవేర్చిందనీ, ఛత్తీస్గడ్ రైతులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అక్కడి రైతులకు రుణమాఫీతో పాటు కనీస మద్ధతు ధర ధాన్యం క్వింటాలుకు బోనస్‌తో కలుపుకుని రూ.2,500 ఇస్తున్నామని తెలిపారు. కేసీఆర్ రైతుల ఆవేదన పట్టించుకోవడం లేదనీ, ఇద్దరు, ముగ్గురు వ్యాపారుల సలహాలనే వింటున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు కనీస మద్ధతు ధర లభించడం లేదన్నారు. రైతులు భయపడవద్దనీ, ఆందోళన చెందవద్దనీ, కనీస మద్ధతు ధర ఇచ్చి తీరుతామన్నారు. అంతకు ముందు రేవంత్‌రెడ్డి ప్రవేశపెట్టిన వరంగల్ డిక్లరేషన్‌లోని రుణమాఫీ, కనీస మద్ధతు ధర, ఎకరానికి రూ.15 వేలు నేరుగా లబ్ది తదితర అంశాలు కాంగ్రెస్ పార్టీ రైతులకిచ్చే గ్యారంటీ అని తెలిపారు. రైతు బలహీనుడైతే రాష్ట్రం బలహీనమవుతుందనీ, రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలకు వరంగల్ డిక్లరేషన్ పునాది అవుతుందన్నారు. రైతుల కోసం సభ నిర్వహించినట్టుగానే తెలంగాణలో ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్ కోసం సభ నిర్వహిస్తామనీ, వారి పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని తెలిపారు. భవిష్యత్తులో రైతుల కోసం పోరాటం కొనసాగిస్తామన్నారు.
టీఆర్ఎస్, బీజేపీ మధ్య అవగాహన అందుకే... సీబీఐ, ఈడీ దర్యాప్తులుండవు
టీఆర్ఎస్, బీజేపీల మధ్య అవగాహన ఉందని రాహల్ గాంధీ విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు ఎంత అవినీతి చేసినా సీబీఐ, ఈడీ దర్యాప్తులు లేకపోవడమే దీనికి సాక్ష్యమన్నారు. మోడీ సర్కారు తెచ్చిన మూడు నల్లచట్టాలు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు టీఆర్ఎస్ ఏమన్నది?. ఆ పార్టీ బీజేపీికి ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్ధతిస్తున్నదని తెలిపారు. తెలంగాణలో నేరుగా పాలించే శక్తి తమకు లేదని తెలిసిన బీజేపీ, టీఆర్ఎస్ ద్వారా పరోక్షంగా పాలించాలని ప్రయత్నిస్తున్నదన్నారు. తెలంగాణను దోచుకున్న, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను మోసం చేసిన కేసీఆర్ పార్టీతో కాంగ్రెస్ పార్టీకి పొత్తు ఉండదని స్పష్టం చేశారు. తమది సైద్ధాంతిక పోరాటమనీ, రాజుతో పొత్తు ఉండదన్నారు. బీజేపీకి, కాంగ్రెస్‌కు ఎప్పటికీ అవగాహన కుదరదని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ పార్టీతో అవగాహన కోరుకునే కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్లో గానీ, బీజేపీలో గాని చేరాలని సూచించారు. అలాంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి అక్కర్లేదని తేల్చిచెప్పారు. ఆ పార్టీలతో సంబంధాలున్న కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తులు ఎంతటి వారినైనా బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు టికెట్ల పంపిణీ ప్రతిభ ఆధారంగా ఉంటుందనీ, ఆ ప్రతిభ పేదల పక్షాన చేసిన పోరాటాలేనని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పోరాటం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ఉంటుందనీ, టీఆర్ఎస్ను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను వదిలేది లేదని హెచ్చరించా రు. ప్రజలు తమ ఆకాంక్షలు నెరవేరి, మెరుగైన జీవితం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాడారనీ, ఆ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచిందనీ, సోనియాగాంధీ ఆ కలను నిజం చేశారని గుర్తుచేశారు. అయితే రాష్ట్ర ఏర్పాటు స్వప్నం నెరవేరలేదని విమర్శించారు. ఒక కుటుంబమే బాగా లబ్ది పొందిందని పరోక్షంగా కేసీఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పాటు ప్రజల రక్తం, కన్నీళ్లు,పోరాటంతో వచ్చిందన్నారు. అలాంటి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ముఖ్యమంత్రిగా కాకుండా కేసీఆర్ ఒక రాజులా పాలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ రాజు ప్రజల అవసరాలు గుర్తించక, తాను అనుకున్నదే చేస్తాడని తెలిపారు. తెలంగాణ ప్రజలు, సోనియా గాంధీ కలను నెరవేర్చడానికి రాష్ట్రంలో ఎక్కడికైనా వచ్చి ప్రజలతో కలిసి పోరాడుతానని తెలిపారు.
ఒక్క ఛాన్స్.....
రెండు సార్లు టీఆర్ఎస్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి. పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయనివ్వండి. టీఆర్ఎస్ ప్రజలను మోసం చేసింది. అందరితో కలిసి కాంగ్రెస్ పార్టీ మీ కలను నిజం చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
కేసీఆర్ దొంగ...
తెలంగాణలో వేల కోట్లను దోచుకున్నదె వరంటూ రాహుల్‌గాంధీ సభకు హాజరైన వారినుద్దేశించి ప్రశ్నించారు. దీంతో వారు కేసీఆర్ దొంగ అంటూ గట్టిగా సమాధానం వినిపించారు.