Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరెంటు కోసం రైతుల ఎదురుచూపులు
- డీడీలు చెల్లించి ఏడాది
- కాళ్లరిగేలా తిరుగుతున్నా స్పందించని అధికారులు
- నీటి సౌకర్యం లేక నష్టపోతున్న కర్షకులు
నవతెలంగాణ- ఆదిలాబాద్ ప్రాంతీయ ప్రతినిధి, బేల
బేల మండలం డొప్టాలకు చెందిన అంకత్ శంకర్ కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేశారు. ఏడాది కిందట డీడీ చెల్లించారు. అధికారులు విద్యుత్ తీగలు లాగి, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. కానీ ఎర్తింగ్ తీగ లేదనే కారణంగా కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో సదరు రైతు అధికారుల చుట్టూ తిరిగినా కనికరించడం లేదు. గత్యంతరం లేక ఆయిల్ ఇంజిన్ సాయంతో నీటి తడులు పెట్టి కూరగాయలు సాగు చేస్తున్నారు. ఈ ఒక్క రైతే కాకుండా అధికారుల కనికరం కోసం అనేక మంది కర్షకులు ఎదురు చూస్తున్నారు.
- తాంసి మండల కేంద్రానికి చెందిన రైతు చిల్కూరి స్వామిరెడ్డి. ఏడాది కిందట వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ కోసం రూ.5295 డీడీ చెల్లించారు. ఇప్పటి వరకు సంబంధిత అధికారులు కనెక్షన్ ఇవ్వలేదు. ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి రైతులు అనేక మంది ఉన్నారు.
విద్యుత్ విషయంలో క్షేత్రస్థాయి అధికారుల తీరుతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చేనులో కరెంటు కోసం కార్యాలయం చుట్టూ కర్షకులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కొత్త వ్యవసాయ కనెక్షన్ల కోసం మీసేవలో డీడీలు చెల్లించి ఏడాదిపైగా కావస్తున్నా.. కరెంటు సౌకర్యం కల్పించడం లేదు. అధికారులను అడిగితే ఇప్పుడు.. అప్పుడు అంటూ దాటవేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పైరవీలు, రాజకీయ పలుకుబడి కలిగిన వారికే అధిక ప్రాధాన్యమిస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొందరు అధికారులు ఏదో ఒక వంకతో కావాలనే జాప్యం చేస్తున్నారని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం చెరువులు, కుంటలను ఆధునీకరించడంతో నీటి లభ్యత పెరిగింది. ఇది వరకు కేవలం వర్షాధారం మీదనే పంటలు పండించగా.. ప్రస్తుతం నీటి వనరులు అందుబాటులోకి రావడంతో బోర్లు, చెరువుల ద్వారానూ పంటలు ఎక్కువగా పండిస్తున్నారు. ప్రభుత్వం వ్యవసాయ కనెక్షన్లకు ఉచిత కరెంటు ఇవ్వడంతో అనేక మంది రైతులు పంట పొలాల్లో బోర్లు వేస్తున్నారు. వీటికి విద్యుత్ కనెక్షన్ తీసుకునేందుకు మీసేవలో డీడీ రూపంలో విద్యుత్ శాఖకు రూ.5600చెల్లించారు. ఈ డబ్బులతో రైతుల పొలాలకు తీగలు లాగడం, ట్రాన్స్ఫార్మర్ బిగించి కనెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీసేవలో డీడీలు చెల్లించిన రైతులకు ప్రాధాన్య క్రమంలో (ముందుగా డీడీలు చెల్లించిన వారికి) కొత్త కనెక్షన్లు బిగించాల్సి ఉంటుంది. కానీ ఈ నిబంధనలను అధికారులు తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 3353 మంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసుకోగా..2021-22 ఏడాది వరకు కేవలం 1853మంది రైతులకే కనెక్షన్లు అందించారు. మిగతా 1504మంది రైతులు ఎదురు చూస్తున్నారు.
పైరవీలకే ప్రాధాన్యం..?
కొత్త కనెక్షన్ల జారీలో అధికారులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారనే విమర్శలున్నాయి. ఏడాది కిందట డీడీలు చెల్లించినా కనెక్షన్లు ఇవ్వడం లేదు. సవాలక్ష కారణాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారనే ప్రచారం ఉంది. పైరవీలు, రాజకీయ పలుకుబడితోపాటు లోపాయికారి ఒప్పందానికి ముందుకొచ్చిన వారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు గత్యంతరం లేక ఆయిల్ ఇంజిన్లసాయంతో నీటి తడులు పెడుతున్నారు. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభమైతే పొలాల్లోకి వెళ్లి కనెక్షన్లు ఇవ్వడం సమస్యగా మారుతుంది.
కనెక్షన్లు త్వరగా అందజేస్తున్నాం..
ఉత్తంజాడే- విద్యుత్‌శాఖ ఎస్ఈ
వ్యవసాయ కనెక్షన్ల కోసం దరఖాస్తులు చేసిన రైతులకు త్వరగానే కనెక్షన్లు ఇస్తున్నాం. కొందరు రైతులు పొలాల్లో బోర్లు వేయకపోయినా ముందుగానే కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాంటి వారికే ఆలస్యం జరుగుతోంది. మిగతా రైతులకు ప్రాధాన్యక్రమంలో ఎప్పటికప్పుడూ కనెక్షన్లు అందజేస్తున్నాం. అధికారులు జాప్యం చేస్తే తన దృష్టికి తీసుకురావాలి. వెంటనే సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తాను.