Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధుల్లేక ఏండ్ల తరబడి పెండింగ్
- ఆర్భాటమే తప్ప ఆచరణలో అంతంతే
- 144 పనులకుగాను 27 మాత్రమే పూర్తి
- దేశవ్యాప్తంగా 60 శాతమే
- చోద్యం చూస్తున్న కేంద్రం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు అమలు రాష్ట్రంలో ఒక అడుగు ముందుకు , రెండడుగులు వెనక్కిలా తయారైంది. ఈ పథకంలో పనులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండ టమే ఇందుకు నిదర్శనం. కరీం నగర్లో కేవలం 10 శాతం, వరంగల్‌లో సుమారు 35 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు అంటు న్నారు. వాస్తవానికి ఇరు ప్రభుత్వాలు చేపట్టాలనుకున్న మొత్తం 144 ప్రాజెక్టు పనుల్లో ఇప్పటివరకు పూర్తిచేసినవి 27 మాత్రమే. ఈ సంగతి గత పార్లమెంటు సమా వేశాల్లో కేంద్రం తెలియజేసింది. ఆర్థికాభివృద్ధితోపాటు ప్రజలకు నాణ్యమైన జీవితాన్ని ఇచ్చే లక్ష్యంతో స్మార్ట్సీటీలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. అంతేగాక ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ద్వారా సత్ఫలితాలు సాధించాలని భావించింది. ఇందుకోసం పలు అబివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది.
ద్వితీయ శ్రేణి నగరాల కోసమే...
దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి నగరాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో స్మార్ట్సీటీల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. రాష్ట్రం నుంచి గ్రేటర్ వరంగల్, కరీంనగర్ నగరాలను మరింత అభివృద్ధిచేయాలని సంకల్పించింది. ఈ రెండు నగరాల్లో మౌలిక వసతుల కోసం ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.100 కోట్లు స్మార్ట్‌సిటీల పథకంలో భాగంగా ఖర్చుచేయాలని నిర్ణయించాయి. కాగా ఈ పథకానికి కరీంనగర్ ప్రగతికి ఇప్పటివరకు రూ.1609 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నా, కేవలం రూ.166.46 కోట్లు మాత్రమే ఇచ్చారు. దీంతో 62 పనులు పూర్తి కావాల్సి ఉన్నా, కేవలం తొమ్మిది మాత్రమే చేపట్టారు. ఈ గణాంకాల ప్రకారం నిర్దేశించుకున్న లక్ష్యంలో కేవలం 10 శాతం పనులు మాత్రమే జరిగాయి. అదే సమయంలో గ్రేటర్ వరంగల్ జిల్లాకు రూ.1752,31 కోట్లు ఖర్చు చేయాల్సి ఉన్నప్పటికీ, కేవలం రూ.582.63 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో 82 పనులు పూర్తి కావాల్సి ఉన్నా కేవలం 18 మాత్రమే చేశారు. సుమారు 35 శాతం పూర్తయ్యాయి.
తీవ్ర ఆలస్యం
స్మార్ట్‌సిటీల ప్రాజెక్టు ప్రక్రీయ తీవ్ర ఆలస్యమవు తున్నది. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కారణమేనని సమాచారం. తమ, తమ వాటా నిధులు కేటాయించకుండా చోద్యం చూస్తున్నదనే విమర్శలనుకేంద్రం ఇప్పటికే ఎదుర్కొంటున్నది. కాగా రాష్ట్రంపై వచ్చిన నిధులు ఇతర పథకాలకు మళ్లిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. రెండు నగరాలకు కలిపి రూ.3,361.74 కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించినా, కేవలం రూ.1884.79 కోట్లు మాత్రమే కేటాయించారని అధికారులు చెబుతున్నారు. మిగతా నిధులు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం తన వాటాను నిలిపివేస్తున్నదని సంబంధిత అధికారవర్గాలు చెబుతున్నాయి.
ఇంకా డీపీఆర్ దశలోనే..
రెండు నగరాల పరిధిలోని చాలా పనులు ఇంకా డీపీఆర్ దశలో ఉన్నాయి. గ్రేటర్ వరంగల్‌లో 12 పనులు ఉండగా, వాటి అంచనా విలువ రూ.139.21 కోట్లు, కరీంనగర్లో 31 పనులకుగాను వాటి అంచనా విలువ రూ.822.70 కోట్లుగా ఉంది. టెండర్ స్థితిలో వరంగల్‌కు సంబంధించి తొమ్మిది పనులు ఉండగా, వాటి విలువ రూ.279.90 కోట్లు , కరీంనగర్ పరిధిలో ఆరు పనులకుగాను రూ.235.14 కోట్లని సమాచారం. పని అప్పగించే స్థితిలో వరంగల్‌లో 18 పనులకుగాను రూ.582.90 కోట్లు, కరీంనగర్లో తొమ్మిది పనులకుగాను రూ.169.46 ఉన్నాయని అధికారులు అంటున్నారు.సకాలంలో నిధులు కేటాయించి, ఖర్చు చేసి ఉంటే ఇప్పటికే ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేవని పేరు రాయడానికి ఇష్టపడని అధికారులు చెబుతున్నారు.
దేశంలో 60 శాతమే
అయితే స్మార్ట్‌సిటీల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 6282 పనులు చేపట్టాలని నిర్ణయించగా, వాటి కోసం దాదాపు రూ.1,91,238 కోట్లు ఖర్చవు తాయని ఆ శాఖ అధికారుల ప్రాథమిక అంచనా. వీటిలో గత 2022, మార్చి నాటికి కేంద్ర గృహ నిర్మాణ, అర్భన్ డెవలప్మెంటు శాఖ అధికారుల సమాచారం ప్రకారం దేశంలోని 100 స్మార్ట్సీటీలకు రూ.59,959 కోట్లు ఖర్చు చేసి 3,576 పనులను మాత్రమే పూర్తిచేసింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల పనులు ఆశించిన స్థాయిలో పురోగతిలో లేవు. సుమారు 60 శాతం మాత్రమే పూర్తయినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.