Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 4,42,546 మంది విద్యార్థుల హాజరు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1 పరీక్ష రాశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా జరిగిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,64,756 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం జరిగిన పరీక్షకు 4,42,546 (95.3 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 22,210 (4.7 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఇంటర్ బోర్డు తరఫున పరిశీలకులు నిజామాబాద్, కామారెడ్డి, సిద్ధిపేట, కరీంనగర్, పెద్దపల్లి, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారని వివరించారు. నిజామాబాద్‌లో ఒక విద్యార్థి మాల్‌ప్రాక్టీస్ చేస్తూ దొరికారని తెలిపారు. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష జరిగిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న ఎంఏఎం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తాగునీరు అందుబాటులో ఉంచలేదనే కారణంతో చీఫ్ సూపరింటెండెంట్ (సీఎస్) దుర్గను కలెక్టర్ ఎల్ శర్మన్ సస్పెండ్ చేశారు. అక్కడ మైసారం ప్రభుత్వ జూనియర్ కాలేజీ (బాలికలు) ప్రిన్సిపాల్ సాబేర్‌ను చీఫ్ సూపరింటెండెంట్‌గా నియమించారు. పరీక్షా కేంద్రాలన్నింటినీ తహసీల్దార్లు సందర్శించాలనీ, మౌలిక సదుపాయాల కల్పనలో నిబంధనలు ఉల్లంఘిస్తే సీఎస్, డిపార్ట్మెంటల్ అధికారి (డీవో), కస్టోడియన్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, సీసీ కెమెరాలు, టెంట్ అందుబాటులో ఉండాలనీ, మొబైల్ ఫోన్లు వినియోగించొద్దని కోరారు. నిమిషం నిబంధన వల్ల సకాలంలో చేరుకోని కొందరు విద్యార్థులను సైతం సిబ్బంది పరీక్షా కేంద్రాల లోపలికి అనుమతించడం గమనార్హం. ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, హైదరాబాద్ కలెక్టర్ ఎల్ శర్మన్ కలిసి నగరంలోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరిశీలించారు. బషీర్‌బాగ్‌లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ, మలక్‌పేటలోని ముంతాజ్ జూనియర్ కాలేజీ, నారాయణగూడలో ఉన్న రెహనా జూనియర్ కాలేజీలను సందర్శించి పరీక్ష తీరును గమనించారు.