Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణ పనుల్లో నాణ్యతపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని సీపీఐ(ఎం) మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు గుట్ట నిర్మాణ పనులు నాసిరకంగా ఉన్నట్టు తేలిపోయిందని చెప్పారు. ఈ మేరకు శుక్రవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆలయం ఘాట్ రోడ్డు కుంగి, భారీ కోతకు గురైందనీ, ముఖద్వార మండపం, క్యూ కాంప్లెక్స్, ప్రసాదం విక్రయశాలలు జలాశయాలుగా మారాయని తెలిపారు. స్థంభాలు, చలువ పందిళ్లు కూలిపోయాయని చెప్పారు. రెండేండ్లుగా రూ.1,200 కోట్ల వ్యయంతో ముఖ్యమంత్రి స్థాయి అధికారులు, ఇంజినీర్లు పలుమార్లు ఇక్కడ పర్యటించి, పనులు పర్యవేక్షించినా నాశిరకం పనులు ఎలా జరిగాయని ప్రశ్నించారు. సర్కారు పర్యవేక్షణ 'మేడిపండు' చందమేనని మొన్నటి వర్షాలతో తేలిపోయిందన్నారు. దీనికి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలపీ, మరమ్మతు పనులు తక్షణం చేపట్టాలని డిమాండ్ చేశారు.