Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి శ్రీనివాసగౌడ్ ఎద్దేవా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అంటే బందిపోట్లు.. జేబుదొంగల పార్టీ అని రాష్ట్ర మంత్రి శ్రీనివాసగౌడ్ ఎద్దేవా చేశారు. మతం పేరిట ఆ పార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభపక్ష కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, అంజయ్య యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి శ్రీనివాసగౌడ్ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే బీజేపీ నేతలు పాదయాత్రల పేరిట హడావుడి చేస్తున్నారని అన్నారు. తద్వారా పచ్చగున్న పాలమూరులో చిచ్చు రేపేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీలేరు విద్యుత్ కేంద్రంతోపాటు ఏడు మండలాలను బీజేపీ... ఏపీకి కట్టబెట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు సంగ్రామ యాత్రంటూ మహబూబ్‌నగర్‌లో పాదయాత్ర చేస్తున్న బండి సంజరుకు ఈ విషయం తెలియదా..? అని ప్రశ్నించారు. అసలు ఆయన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలా నియమించారోనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా సంజరుతోపాటు ఆ పార్టీ నేతలందరూ తీరు మార్చుకోవాలనీ, లేదంటే ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న సీట్లు కూడా వచ్చే ఎన్నికల్లో దక్కబోవని హెచ్చరించారు.