Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న, వరి ధాన్యానికి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో కోరారు. వర్షాలకు వరి, మొక్కజొన్న, మామిడి, ఇతర పంటలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోవడంతో రైతులు మానసిక క్షోభకు గురవుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తగాదాల వల్ల వరి ధాన్యం కొనుగోలు ఆలస్యమైందని పేర్కొన్నారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వరద ఉధృతికి వరి ధాన్యం పలు ప్రాంతాల్లో కొట్టుకుపోయిందని తెలిపారు. గతేడాది వర్షాల కారణంగా పాడైన పంటలను ప్రభుత్వం సర్వే చేసినా ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం అందించలేదని గుర్తు చేశారు. వెంటనే మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పాడైపోయిన మామిడి, ఇతర పంటలకు నష్టపరిహారాన్ని అందించాలని కోరారు.
నాగరాజు హత్యకు ఖండన
సరూర్నగర్లో నడిరోడ్డుపై నాగరాజును కక్షగట్టి హత్యచేయడాన్ని సీపీఐ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. ముస్లిం యువతిని ప్రేమించి పెండ్లి చేసుకున్నాడనే కారణంతో ఆ యువతి సోదరుడు దళిత యువకుడైన నాగరాజును హత్య చేయడం తీవ్రంగా కలచివేసిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారికి ప్రాణహాని ఉందంటూ పోలీసులకు మొరపెట్టుకున్నా రక్షణ కల్పించకపోవడం, పోలీసుల నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని విమర్శించారు. మతాంతర, కులాంతర వివాహాలు చేసుకున్న వారి ప్రాణాలకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని తెలిపారు. గతంలో హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే నాగరాజు హత్య జరిగేది కాదని పేర్కొన్నారు. ఆశ్రిన్ సుల్తానాకు పరిహారం అందించడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నాగరాజు తల్లిదండ్రులను ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.