Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగరాజు హత్య దుర్మార్గం
- ఆశ్రీన్‌కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి : టిస్కైలాబ్ బాబు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో ఇప్పటి వరకు 70కిపైగా జరిగిన కుల దురహంకార హత్యలు బీజేపీకి కనిపించవా? అని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి స్కైలాబ్‌బాబు ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య పార్కు వద్ద మతదురహంకార హత్యకు గురైన నాగరాజు హత్యను నిరసిస్తూ, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డున నాగరాజు అనే దళిత యువకుడు..తన సోదరిని ప్రేమ వివాహం చేసుకున్నాడనే కక్షతో అతడి భార్య ఆశ్రీన్ సోదరులు మత దురహంకారంతో అత్యంత కిరాతంగా హత్య చేశారని తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆమే సోదరులు మత ఉన్మాదంతోనే ఈ హత్యకు ఒడిగట్టారని పేర్కొన్నారు. ఇది ఆధిపత్య దురహంకారమని విమర్శించారు. ఈ హత్యను బీజేపీ నేత బండి సంజరు, మతోన్మాద సంస్థలు దళిత హిందువును హత్య చేశాయంటూ గగ్గోలు పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో 70కి పైగా కుల మత దురహంకార హత్యలు జరిగితే అవన్నీ బండి సంజరు కంటికి కనిపించలేదా అని ప్రశ్నించారు. దళిత హిందూ, ముస్లిం హిందూ అనేవారు ఉండరని పేర్కొన్నారు. దళితులు ఎక్కడైనా అంటరాని వారిగానే చూడబడుతున్నారని తెలిపారు .బీజేపీ నేతలు మత విద్వేషపు మాటలు మానుకోవాలని హితవు పలికారు .ఎంఐ ఎం నేత అసదుద్దీన్ ఓవైసీ కి మానవీయ కోణం ఉంటే నాగరాజు కుటుంబాన్ని పరమర్శించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అతడి భార్య ఆశ్రీన్‌కు ప్రభుత్వ ఉద్యోగం, రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలనీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి, కులనిర్మూలన సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణ చంద్‌తోపాటు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, లయన్ పీ ఎం గుప్తా, రాపర్తి సంతోష్ గౌడ్, డాక్టర్ బాహు రవి తదితరులు మాట్లాడారు.