Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌లోని 18 ఆస్పత్రుల్లో అమలు
- ప్రభుత్వాస్పత్రుల్లో 56 శాతం ప్రసవాలు
- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ- సుల్తాన్‌బజార్/జూబ్లీహిల్స్
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగి వెంట ఉండే సహాయకులకు ఈనెల 12 నుంచే రూ.5కు నాణ్యమైన భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, హైదరాబాద్‌లోని 18 ఆస్పత్రుల్లో అమలు చేస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 30 శాతం నుంచి 56 శాతం వరకు పెరిగిందన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు మరింత చేరువచేస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో సీటీ స్కాన్ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. కోటి ఈఎన్టీ ఆస్పత్రిలో ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుల్తాన్ బజార్‌లోని మెటర్నిటీ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్‌కు కావాల్సిన పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి సీఎం కేసీఆర్ వైద్యారోగ్యశాఖకు బడ్జెట్ రెట్టింపు చేశారని తెలిపారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో 10 రేడియాలజీ ల్యాబ్‌లను ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఆస్పత్రుల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. కోఠి ప్రసూతి ఆస్పత్రిలో సాయంత్రం కూడా ఓపీ సేవలు ప్రారంభించాలని, అందుకు అవసరమైన సిబ్బందిని కేటాయిస్తామని చెప్పారు. ఎవరైనా ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల డాక్టర్లు అనవసరంగా టెస్టులు, సర్జరీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆధునిక వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తామన్నారు. హైదరాబాద్‌కు నాలుగు దిక్కులా 4000 పడకలతో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. నిమ్స్‌లో మరో 2000 పడకలు ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రులను సందర్శించిన సందర్భంగా మంత్రి రోగులతో మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యేలు గోపీనాథ్, రాజాసింగ్, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, కోటి ఈఎన్టీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి, గన్‌ఫౌండ్రీ కార్పొరేటర్ సురేఖ ఓం ప్రకాశ్, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.