Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంగీత ప్రియుల గమ్యం ''లెర్న్ అండ్ ఎర్న్''
- ఐపీఆర్‌ఎస్ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రముఖ సంగీత దర్శకులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
సంగీతంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, పునరుత్తేజం అయితేనే ఉత్తమ సంగీత దర్శకులు ఆవిర్భవిస్తారని పలువురు సినీ సంగీత దర్శకులు చెప్పారు. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్ (ఐపీఆర్‌ఎస్) ఆధ్వర్యంలో శుక్రవారంనాడిక్కడి ఓ స్టార్ హౌటల్లో 'లెర్న్ అండ్ ఎర్న్' వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ప్రముఖ సంగీత దర్శకులు చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, ఎస్ తమన్, రాకేష్ నిగమ్, మయూర్ పూరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐపీఆర్‌ఎస్ 1969 నుండి స్వరకర్తలు, పాటల రచయితలు, ప్రచురణకర్తల హక్కులను పరిరక్షిస్తున్నదనీ, ప్రతిభావంతులైన క్రియేటర్లు తమ హక్కులు, అవకాశాల గురించి సరైన అవగాహన లేక బాధపడటం కలవరపెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో సంగీత దర్శకులు పడిన అవస్థలను తాము ప్రత్యక్షంగా చూశామన్నారు. సంగీత ప్రపంచంలో అనేక మార్పులు సంభవిస్తున్నాయనీ, పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిందనీ, ఆస్థాయిలో సంగీత కూర్పును దర్శకులు ఇప్పుడు కోరుకుంటున్నారని చెప్పారు. ఆ దిశగా వర్క్‌షాప్‌లో చర్చలు జరగాలని ఆకాంక్షించారు. సంగీతంలో కాపీరైట్, డిజిటల్ యుగంలో అభివద్ధి చెందుతున్న ట్రెండ్లకు, సాంకేతిక పురోగతికి లైసెన్స్ ఇవ్వడం, క్రియేటర్ల హక్కులు, వారికి న్యాయంగా రావలసిన వాటిని రక్షించడంలో ఐపీఆర్‌ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఐపీఆర్‌ఎస్ సీఈఓ రాకేష్ నిగమ్ సంస్థ ఆర్థిక పురోగతిని వివరించారు.