Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీ చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్తింపజేయాలని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యకు యూనియన్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు. గుజరాత్ రాష్ట్రంలో రిటైర్డయిన ఐదుగురు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు తమకు పదవీ విరమణ సదుపాయమైన గ్రాట్యుటీ వర్తింపజేయాలని కోరుతూ సుప్రీం కోర్టును వారు అర్హులేనని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. 'అంగన్వాడీలు కార్మికులేనని సుప్రీం కోర్టు చెప్పింది. గ్రాట్యుటీ చట్టంలోని ''వేతనాలు'' నిర్వచనం చాలా విశాల ప్రాతిపదికలో ఉన్నదనీ, డ్యూటీలో ఉన్న ఉద్యోగికి వచ్చే ప్రతిఫలం వేతనం కిందికి వస్తుందని చెప్పింది. కావున అంగన్వాడీ వర్కర్లకు, హెల్పర్లకు చెల్లించే గౌరవ వేతనం కూడా వేతనం నిర్వచనం కిందికే వస్తుందని చెప్పింది. కావున వేతనాలు పొందుతున్న అంగన్వాడీలు గ్రాట్యుటీకి అర్హులని చెప్పింది. గ్రాట్యుటీ చట్టంలోని సెక్షన్ 1(3) (సి)ను అనుసరించి కేంద్ర ప్రభుత్వం 1997 ఏప్రిల్ 3న విద్యా సంస్థలను ఎస్టాబ్లిష్మెంట్స్గా పేర్కొంటూ ఉత్వర్వులిచ్చింది. అంగన్వాడీ కేంద్రాల్లో మూడు నుంచి ఆరేండ్ల పిల్లలకు ప్రీ స్కూల్ నిర్వహిస్తున్నారు. కాబట్టి అది పూర్తిగా విద్యా కార్యక్రమమేనని చెప్పింది. బోధన కార్యక్రమాన్ని అంగన్వాడీ వర్కర్లు నిర్వహిస్తున్నారన్నది. కావున అంగన్వాడీ సెంటర్లు గ్రాట్యుటీ చట్టంలోని ఎస్టాబ్లిష్మెంట్ నిర్వచనం కిందకు వస్తాయని చెప్పింది. వీటితో పాటు దేశవ్యాప్తంగా 15.8 కోట్ల చిన్నారుల పోషకాహార బాధ్యతలు, గర్భిణీ, బాలింతల సంక్షేమం వంటి ముఖ్యమైన కార్యక్రమంలో అంగన్వాడీలు భాగస్వాములు అవుతున్నారు. అలాంటప్పుడు వారిని పార్ట్ టైమ్ వర్కర్లుగా భావించలేమని సుప్రీం కోర్టు చెప్పింది' అని దివ్వ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలోని అంగన్వాడీలకు న్యాయం చేయాలని కోరారు.